Fever Blisters Causes and Symptoms:చాలా మందికి పెదవుల చుట్టూ లేదా అంచుల మీద నీటి పొక్కుల మాదిరిగా చిన్న చిన్న దద్దుర్లు ఏర్పుడుతుంటాయి. ఇలా వస్తే వేడి చేసిందని కొద్దిమంది, బల్లి మూత్రం పడిందని మరికొద్దిమంది అంటుంటారు. కానీ.. ఇలా పెదవుల చుట్టూ పొక్కులు ఏర్పడటానికి అసలు కారణం వేరే ఉందంటున్నారు నిపుణులు. ఈ సమస్య వైరస్ వల్ల వస్తుందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కు సంబంధించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ అండ్ క్రానియోఫేషియల్ రీసెర్చ్ ప్రచురించింది(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి). ఇంతకీ ఏంటా వైరస్? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కారణాలు:పెదవుల చుట్టూ వచ్చే నీటి పొక్కులను ఫీవర్ బ్లిస్టర్స్ అంటారు. వీటినే కోల్డ్ సోర్స్ అని కూడా పిలుస్తారు. ఇవి ప్రధానంగా ''హెర్పీస్ సింప్లెక్ష్ వైరస్ -HSV వలన వస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ వైరస్ ఒకసారి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత, జీవితాంతం శరీరంలోనే ఉంటుందని.. రోగనిరోధకశక్తి తగ్గినప్పుడు బయటపడుతుందని అంటున్నారు. అంతేకాకుండా ఒత్తిడి, హార్మోన్స్ అసమతుల్యత వంటి కారణాల వల్ల ఈ వైరస్ మళ్లీ చురుకుగా మారి.. పెదవుల చుట్టూ పొక్కులు వస్తాయని అంటున్నారు.
లక్షణాలు:ఈ సమస్య ఉన్న అందరిలో ఒకే విధమైన లక్షణాలు కనిపించవని.. మనిషి మనిషికీ మారుతుంటాయని అంటున్నారు. కొంతమందికి తీవ్రమైన లక్షణాలు ఉండగా, మరికొంతమందికి తక్కువ తీవ్రతతో కూడిన లక్షణాలు ఉంటాయంటున్నారు. ఆ లక్షణాలు చూస్తే..
- ఈ పొక్కులు పెదాలు, గడ్డం, బుగ్గలు, ముక్కుకు దగ్గరలో కనబడుతుంటాయి.
- ఈ పొక్కులు ఉన్న ప్రదేశంలో ఉన్నవారిలో నొప్పి, దురద, మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి.
- అలాగే కొన్నిసార్లు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, అలసట, లింప్ నోడ్స్ లో వాపు, దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి.
- పొక్కులు ఉన్న చోట నొప్పి వల్ల తినడం, తాగడం కష్టంగా ఉంటుంది.
- కొన్ని సందర్భాల్లో చెంపలు, ముక్కు లోపల కూడా ఫీవర్ బ్లిస్టర్స్ రావచ్చు.