Eating Food Too Fast Effects :అసలే టైమ్ లేదు, తినడానికి ఏది ఉంటే అది పెట్టు వెంటనే తిని వెళ్లిపోవాలంటూ మనలో చాలామంది భోజనం చేసే సమయంలో హడావిడి చేస్తుంటారు. ఆహారం పెట్టుకున్న వెంటనే గబగబా తినేసి వెళ్లిపోతుంటారు. భోజనానికి కూడా సరిగ్గా సమయం కేటాయించకుండా, ఏదో కడుపు నింపాలి కదా అని చాలామంది ఇలా చేస్తుంటారు. అయితే ఇలా తినడం వల్ల నష్టం కలుగుతుందని అంటున్నారు వైద్యులు. గబగబా ఎందుకు తినకూడదో, ఎలా తింటే ఆరోగ్యానికి మేలు కలుగుతుందో అనే విషయాలపై డాక్టర్లు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.
గబగబా తింటే జరిగేది ఇదే!
ప్రశాంతత లేని ఉరుకుల పరుగుల జీవితాల్లో భోజనానికి తగిన సమయం కేటాయించే పరిస్థితి లేదు. దీంతో చాలామంది టైం లేదనే సాకుతో గబగబా తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల ఆహారం ద్వారా శరీరానికి అందాల్సిన అన్ని రకాల పోషకాలు అందవని ప్రముఖ పోషకాహార నిపుణురాలు డా.స్వరూపారాణి చెబుతున్నారు. అలాగే గబగబా తినడం వల్ల ఆరోగ్యానికి కీడు జరుగుతుందని ఆమె హెచ్చరిస్తున్నారు.
ప్రక్రియ పూర్తికాకుండానే లోపలికి!
Eating Food Too Fast Symptoms : ఆహారాన్ని నోటి ద్వారా తీసుకునే సమయంలో నోటిలోనే చాలా వరకు ఆహారం జీర్ణం అవుతుందని, గబగబా తినడం వల్ల ఆహారాన్ని నమలడం జరగదని డాక్టర్లు వివరిస్తున్నారు. దీనితో నోటిలో ఆహారం జీర్ణం అవ్వదని అంటున్నారు. నిజానికి నోటిలో ఆహారం పళ్ల మధ్య కొంత వరకు జీర్ణం అవడమే కాకుండా సలైవాతో కలిసి మెత్తగా మారుతుంది. కానీ గబగబా తినడం వల్ల ఈ ప్రక్రియ పూర్తికాకుండానే ఆహారం జీర్ణాశయంలోకి చేరుతుంది.
దీని ఫలితంగా ఆహారం జీర్ణం అవడంలో అవరోధాలు ఏర్పడతాయి. దీంతో పొట్టలో గ్యాస్ లేదంటే ఎసిడిటీ సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలు దీర్ఘకాలం పాటు వేధించేవి. గనుక ఆహారాన్ని గబగబా తినే వారిలో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు.