Eating Excess Fruits Good Or Bad :రోజూ ఒక యాపిల్ పండు తినండి-డాక్టర్‌కు దూరంగా ఉండండి అనే సామెత గురించి అందరికీ తెలుసు. అంటే దీని అర్థం ప్రతిరోజు యాపిల్ తినడం వల్ల మీ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది, తద్వారా డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం రాదని. ఇదిలా ఉంటే చాలామంది ఈ మధ్యకాలంలో తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పండ్లను తినాల్సిన దానికంటే అధిక మొత్తంలో తింటున్నారు. అయితే ఇలా ఒకేసారి ఎక్కువ పరిమాణంలో రకరకాల పండ్లను ఇంటికి తెచ్చుకొని అతిగా లాగించేస్తుంటారు. ఈ ధోరణి ఏ మాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.
మరి ఎంత మోతాదులో పండ్లు తినాలి?
పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే, కానీ మోతాదుకు మించి తింటే ఆరోగ్యం మీద దుష్ప్రభావాలు చూపుతాయని చెబుతున్నారు డాక్టర్లు. ప్రతిరోజు శరీరానికి కావాల్సిన పరిమాణంలో ఫ్రూట్స్ తింటే మీకే మంచిదని సూచిస్తున్నారు. అయితే రోజు ఒక వ్యక్తి వంద గ్రాముల పండ్లను, అది కూడా అన్ని రకాల పండ్లను తన డైట్లో భాగం చేసుకోవాలని న్యూట్రిషనిస్టులు అంటున్నారు.
అతిగా తింటే ఏమవుతుంది?
పండ్లలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. వీటిల్లో మినరల్స్, విటమిన్స్ సహా మరెన్నో రకాల పోషక విలువలు ఉంటాయి. ఇవ్వన్నీ శరీరానికి మంచివే అయినా మనం తినే దాదాపు అన్ని పండ్లలో చెక్కర, క్యాలరీల స్థాయులు అధికంగా ఉంటాయి. ఇవి మానవ శరీరానికి ఎప్పటికీ ప్రమాదకరమే. ప్రతికూల ప్రభావాలు చూపుతాయి కూడా. తద్వారా బరువు పెరుగుతారు. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. దీంతో మీరు కొత్త అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఈ పద్ధతిని ఫాలో అవ్వండి
రోజుకు వంద గ్రాముల పండ్లను మాత్రమే తినాలి. ఈ క్వాంటిటీలో అన్ని రకాల పండ్లు ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా పీచు పదార్థం ఎక్కువగా ఉండే పండ్లు, తొక్కతో పాటే తినే పండ్లను మీ డైట్లో చేర్చుకోండి. దీంతో మీ శరీరానికి కావాల్సిన ఫైబర్ అందుతుంది. ఇది మలబద్ధకం సమస్యనూ దూరం చేస్తుంది. అంతేకాకుండా శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ అందుతాయి. అయితే పిల్లలు, గర్భిణీలతో పాటు తరచూ వ్యాయామం చేసేవారు పండ్లను క్రమం తప్పకుండా రోజూ తినవచ్చు.