Chewing Gum Health Benefits:మనలో చాలా మంది చూయింగ్ గమ్ నమలడాన్ని బాగా ఇష్టపడతారు. నోరు దుర్వాసన రాకుండా, తాజాగా ఉండడానికి తరచూ ఏదో ఒక చూయింగ్ గమ్ పెట్టుకుని చప్పరిస్తుంటారు. ఇలా చూయింగ్ గమ్ నమలడం వల్ల నిజానికి మన ఆరోగ్యానికి కొంత మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నోట్లో లాలాజలం ఉత్పత్తి జరుగుతుందని, ఒత్తిడి తగ్గుతుందని, నోటికి మంచి వ్యాయామం అవుతుందని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చూయింగ్ గమ్ నమలడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది ఒత్తిడిని తగ్గించుకునేందుకు చూయింగ్ గమ్ నములుతారని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా క్రీడాకారులు అందుకే నములుతారని వివరిస్తున్నారు. చూయింగ్ గమ్ నమలడం వల్ల భయం, ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయని వెల్లడిస్తున్నారు. వీటన్నింటికి కారణమైన అర్డినలిన్ హార్మోన్ను అడ్డుకుంటుందని అంటున్నారు. చూయింగ్ గమ్ నమలడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ జరిగి జ్ఞాపక శక్తి పెరిగినట్లు కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. 2020లో Nutrients జర్నల్లో ప్రచురితమైన "The Effects of Chewing Gum on Cognitive Function in Healthy Adults: A Systematic Review" అనే అధ్యయనంలో ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఇంకా తినాలనే కోరికను తగ్గిస్తున్నట్లు లూసియానా విశ్వవిద్యాలయ పరిశోధనలో తేలింది. అందుకే కొవ్వు, క్యాలరీలు ఎక్కువగా ఉండే పదార్థాలను తినాలనిపించినప్పుడు చూయింగ్ గమ్ నమలాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫలితంగా వాటిపై మనసు మళ్లకుండా ఉంటుందని.. దీంతో బరువు తగ్గుతారని రోడ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. చూయింగ్ గమ్ నమిలే వారు.. మిగిలిన వారికంటే 68శాతం క్యాలరీలు తక్కువగా తీసుకుంటున్నారని, ఇంకా 5శాతం క్యాలరీలు అదనంగా ఖర్చు అవుతున్నాయని వివరిస్తున్నారు. ముఖ్యంగా పేగు సర్జరీ జరిగిన వారు నాలుగు గంటలకోసారి 15 నిమిషాల పాటు చూయింగ్ గమ్ నమలడం వల్ల త్వరగా కోలుకున్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంకా ధూమపానం చేసేవారు చూయింగ్ గమ్ నమిలితే.. కొంత వరకు ఆ అలవాటును తగ్గించుకోవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.
అయితే, ఆకలిగా ఉన్నప్పుడు దీనిని నమలకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఏదో తింటున్నామనే సంకేతాలు మెదడు నుంచి కడుపునకు చేరడంతో జటర రసాలు ఊరి అల్సర్లకు దారి తీస్తుందని చెబుతున్నారు. అదే భోజనం చేశాక తింటే.. త్వరగా జీర్ణం అవుతుందని అంటున్నారు. ఇంకా చూయింగ్ గమ్ నోట్లో బ్యాక్టీరియాను పెరగకుండా చేసి.. దంతాలను రక్షిస్తుందని తెలిపారు.