Sugar Effects on Chronic Disease:ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, హైపర్ టెన్షన్ ఎక్కువగా వస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిని వేధిస్తున్నాయి. అయితే, చిన్నతనంలో చక్కెరను తక్కువగా తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఈ వ్యాధులు రాకుండా అరికట్టవచ్చని పరిశోధకులు అంటున్నారు. చిన్న వయసులో ఎక్కువ చక్కెరను తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు ఉన్నట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధక బృదం వెల్లడించింది. గర్భంలో ఉన్నప్పటి నుంచి 2ఏళ్ల వరకు చిన్నారులు చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల డయాబెటిస్, అధిక రక్త పోటు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఇందుకోసం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్లో అనుసరించిన రేషన్ విధానాన్ని అధ్యయనం చేశారు. ఆ సమయంలో అప్పటి మార్గదర్శకాల ప్రకారం.. పెద్దలకు రోజుకు 40 గ్రాముల చక్కెర, పిల్లలకు 15 గ్రాములు, రెండేళ్ల లోపు చిన్నారులకు చాలా తక్కువ మొత్తంలో ఇచ్చేవారు. అయితే, 1953లో పరిమితులు ఎత్తేసిన తర్వాత చక్కెర వినియోగం దాదాపు రెట్టింపు అయ్యిందని పరిశోధకురాలు యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా ప్రొఫెసర్ డాక్టర్ తడేజా వివరించారు. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 1951 నుంచి మార్చి 1956 వరకు జన్మించిన సుమారు 60,000 మందిపై ఈ పరిశోధన చేపట్టారు. ఇందులో 1954 తర్వాత జన్మించిన లేదా గర్భం దాల్చిన వారు ఎప్పుడూ చక్కెరపై పరిమితిని అనుభవించలేదని తెలిపారు. మిగిలిన వారు గర్భంలో ఉన్నప్పటి నుంచి 2ఏళ్ల వరకు వివిధ సంధర్భాల్లో పరిమిత మోతాదులో చక్కెరను వినియోగించారని వివరించారు.
ఈ అధ్యయనంలో భాగంగా చిన్న వయసులో పరిమితిని అనుభవించి తక్కువ చక్కెరను తీసుకున్నవారిలో డయాబెటిస్, హైపర్ టెన్షన్ ముప్పు తగ్గినట్లు పరిశోధకులు వెల్లడించారు. పరిమితి లేకుండా చక్కెరను తీసుకున్నవారితో పోలిస్తే.. ఎక్కువ కాలం పరిమితితో ఉన్నవారిలో 35శాతం మధుమేహం, 20శాతం హైపర్ టెన్షన్ ముప్పు తగ్గినట్లు వివరించారు. ఇంకా డయాబెటిస్ నాలుగేళ్లు, హైపర్ టెన్షన్ సమస్య రెండేళ్లు ఆలస్యంగా వచ్చినట్లు పేర్కొన్నారు. ఫలితంగా ఆరోగ్యపరమైన ఖర్చులు తగ్గడమే కాకుండా జీవితకాలం పెరుగుతుందని వివరించారు. చిన్న వయసులో ఆహార జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యంపైన ఎక్కువ ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.