Students Protest at Mahabubnagar Government Polytechnic College : స్నానాల గదిలో తమ వీడియోలు తీశారంటూ మేడ్చల్ సీఎంఆర్ ఐటీ క్యాంపస్ విద్యార్థినుల ఆందోళన మరువక ముందే మహబూబ్‌నగర్‌లోని పాలిటెక్నిక్ కళాశాలలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే,
గతంలోనూ వీడియోలు తీశారు : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని బాలికల స్నానాల గదుల గోడపై మొబైల్ కెమెరాల ఘటన కలకలం రేపింది. దీంతో తమకు రక్షణ కల్పించాలని విద్యార్థినులు ఆందోళనకు దిగారు. పరీక్ష రాసేందుకు కళాశాలకు వచ్చిన ఓ విద్యార్థి బాలికల స్నానాల గదుల గోడపై మొబైల్ ఫోన్‌ను ఉంచి వీడియోలు చిత్రీకరించాడని విద్యార్థినిలు అంటున్నారు. దీన్ని గమనించిన ఓ విద్యార్థిని విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకుపోయింది. కానీ ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని వారు ఆరోపించారు. దీంతో కళాశాల వద్ద విద్యార్థినులు ఆందోళనకు దిగారు.
విషయం తెలుసుకున్న ఏబీవీపీ విద్యార్థులు సైతం కళాశాలలో ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విద్యార్థినులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని, నిందితుడిని అరెస్ట్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. కాలేజీలో ఆందోళన సమాచారం తెలుసుకున్న పోలీసులు కళాశాలకు చేరుకున్నారు. అనంతరం పోలీసులు విచారణ చేపట్టారు. విద్యార్థినుల నుంచి వివరాలు సేకరించి నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామని డీఎస్పీ వెంకటేశ్వర్లు హామీ ఇవ్వటంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. గతంలోనూ ఇలాంటి ఘటన జరిగిందని విద్యార్థులు చెప్పడం జరిగిందని, పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని వివరించారు.
"పాలిటెక్నిక్ కళాశాలకు వచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం. విద్యార్థునిల నుంచి ఫిర్యాదు తీసుకొని నిందితుడిపై కేసు నమోదు చేస్తాం. ప్రిన్సిపల్‌పై కూడా విచారణ చేపడతాం. గతంలోనూ కూడా ఇలాంటి ఘటనే జరిగిందని విద్యార్థినిలు అంటున్నారు. మా దృష్టికి రాలేదు. ఆ విషయంపై కూడా విచారణ చేస్తాం. కళాశాల విషయం కాబట్టి ఉన్నతాధికారులకు తెలియజేస్తాం. ఫోన్లో వీడియోలు ఉన్నాయో లేవో మాకు తెలీదు. అది మహిళా పోలీసులు చూసి చెప్తారు."- వెంకటేశ్వర్లు, మహబూబ్‌నగర్ డీఎస్పీ
సీఎంఆర్ కాలేజీలో బాత్రూం వీడియోల వివాదం - వెంటిలేటర్‌పై వేలిముద్రల గుర్తింపు
'బాత్రూం పక్కనే పనివాళ్ల గదులు - అదే అనుమానం కలిగిస్తోంది' - సీఎంఆర్ ఘటనపై ఏసీపీ