TG Government Guarantees not Reaching Eligible People : ప్రజాపాలనలో అభయహస్తం పేరు కింద ఆరు గ్యారెంటీల అమలులో తెలంగాణ ప్రభుత్వం ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణను చేపట్టింది. 2023 డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి 6 వరకు అంటే దాదాపు 10 రోజులు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రజాపాలన సభల్లో ప్రజలు భారీగా దరఖాస్తులు సమర్పించగా అధికారులు వారికి తిరిగి దరఖాస్తుకు సంబంధించిన రసీదులిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల దరఖాస్తులను కంప్యూటరీకరణ చేశారు. అప్లికేషన్లను ఆన్‌లైన్ చేసే క్రమంలో చాలావరకు రేషన్‌కార్డు, గ్యాస్, ఆధార్ కార్డు నంబర్లు తప్పుగా నమోదయ్యాయి. వాటి మళ్లీ ఒకసారి పరిశీలించడానికి గతంలో మున్సిపాలిటీలు, కలెక్టరేట్, ఎంపీడీవో కార్యాలయాల్లో సవరణలు చేశారు.
మూసివేసిన వెబ్సైట్ : ప్రస్తుతం అభయహస్తంకు సంబంధించిన సైట్ మూసివేసి(ఎడిట్) ఆప్షన్ కూడా లేకుండా చేయడంతో దరఖాస్తుదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కొంతమంది సిబ్బంది ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడంతో ఆరు గ్యారెంటీల్లో కనీసం విద్యుత్తు జీరో బిల్లు, రాయితీపై వచ్చే గ్యాస్ సైతం పొందలేకపోతున్నారు. తమ తప్పిదం లేదని, సాంకేతిక కారణాలతో ఎంట్రీలు సక్రమంగా జరగడం లేవని అధికారులు చెబుతున్నారు.
"ఏడాది కిందట ప్రజాపాలనలో అభయహస్తం ద్వారా ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకున్నాం. జీరో విద్యుత్తు బిల్లు, వంట గ్యాస్ సబ్సిడీ రాకపోవడంతో గ్రామపంచాయతీకి వెళ్లాం. అక్కడి అధికారి ఎంపీడీవో కార్యాలయంలో సంప్రదించాలన్నారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే మీ దరఖాస్తు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే ఆరు గ్యారంటీలను అధికారుల తప్పిదాలతో మేము పొందలేకపోతున్నాం" - ఎలగందుల సత్యలక్ష్మి, బాధితురాలు
నాలుగు సార్లు అని చెప్పి, ఒకసారి మాత్రమే : రాష్ట్రంలో పలు పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం పంపిన జాబితా ప్రకారం ఈనెల జనవరి 16న చేపట్టిన సర్వే పూర్తికావొస్తుండడంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఏడాదిగా తిరిగినా ఫలితం లేదని, తమ పరిస్థితి ఏంటని దరఖాస్తుదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా నాలుగుసార్లు ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించి ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పినా, కేవలం ఒకేసారి మాత్రమే దరఖాస్తులను స్వీకరించారు. అప్పట్లో నమోదు చేసుకున్న కొంతమంది అర్హులకు పలు గ్యారంటీలు అందక నష్టపోతున్నారు.
ప్రజాపాలన దరఖాస్తుదారుల్లో అర్హులైనవారు ఈనెల 21న నిర్వహించే గ్రామసభల్లో దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పిస్తున్నామని రెవెన్యూ రెవెన్యూ అధికారులు తెలిపారు. దాదాపు అర్హులందరికీ గృహజ్యోతి, జీరోబిల్లు, గ్యాస్ రాయితీ అందుతున్నాయని, రానివారు గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చునని వెల్లడించారు. దరఖాస్తుదారులకు తిరిగి వారికి సంబంధించిన రసీదు ఇస్తామన్నారు.
"ప్రజాపాలనలో అభయహస్తం కింద ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తు చేశాం. విద్యుత్తు జీరో బిల్లు వర్తించక నెల నెలా మేమే చెల్లిస్తున్నాం. దరఖాస్తుల సవరణ సమయంలో అధికారులను అడిగితే ఆన్‌లైన్‌లో మా దరఖాస్తు నమోదు కాలేదన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మాలాంటి పేదలకు పథకాలు అందేలా చూడాలి" - అన్‌రెడ్డి లక్ష్మి, బాధితురాలు
కొలిక్కి వచ్చిన ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ - క్షేత్రస్థాయి పరిశీలనకు రంగం సిద్ధం
ముగిసిన ప్రజాపాలన- దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్న మంత్రులు