Drinking Raw Milk Risks : ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజు ఒక గ్లాసు పాలు తాగాలని నిపుణులు పదేపదే చెబుతుంటారు. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు పాలను కచ్చితంగా అందించాలని సూచిస్తుంటారు. అయితే, ప్రస్తుత కాలంలో కొంత మంది ఆరోగ్యానికి ఎంతో మంచివని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని పచ్చి పాలు తాగుతుంటారు. ఇలా పచ్చిపాలను తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాల కంటే.. నష్టాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులంటున్నారు. మరి పచ్చిపాలు తాగడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటి ? పాలనుఎలా తాగితే మంచిది ? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా మార్కెట్లో దొరికే ప్యాకెట్ పాలను అత్యధిక ఉష్ణోగ్రత వద్ద కొద్దిసేపు వేడి చేసి, చల్లార్చిన తర్వాత ప్యాకింగ్ చేస్తారు. ఈ పాలను ప్యాశ్చరైజ్డ్ మిల్క్ (Pasteurized Milk) అని అంటారు. అయితే, ఇలా పాలను వేడి చేసి చల్లార్చడం ద్వారా.. అందులోని క్రిములు, బ్యాక్టీరియా వంటివి నశిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొంత మంది ప్యాశ్చరైజ్డ్ మిల్క్‌లో కంటే పచ్చి పాలలోనే ఎక్కువ విటమిన్లు, పోషకాలు ఉంటాయని అనుకుంటారు. కానీ, ఇది నిజం కాదట. ప్యాకెట్ పాలలోనూ.. మనం ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు అన్ని ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
పచ్చిపాలు తాగడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు :
జీర్ణ సమస్యలు: పచ్చిపాలలో సాల్మొనెల్లా, ఇ-కొలి, లిస్టెరియా మోనోసైటోజెనెస్ వంటి హానికరమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. వీటివల్ల జ్వరం, అతిసారం, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాల వంటి జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 2017లో "యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్"లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. లాక్టోస్ ఇంటాలరెన్స్ (Lactose intolerance) ఉన్న వారు పచ్చిపాలు తాగడం వల్ల వాంతులు, విరేచనాలు, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు కనిపించాయని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో స్కాట్లాండ్లోని అబెర్డీన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ డాక్టర్ డేవిడ్ డెన్హోమ్ పాల్గొన్నారు. పచ్చిపాలు తాగిన కొంతమందిలో వాంతులు,విరేచనాల వంటి లక్షణాలు కనిపించాయని ఆయన పేర్కొన్నారు.