Drinking Water Before Eating to Lose Weight:మనలో చాలా మంది బరువు తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యాయామాలతో పాటు మందులు తీసుకుంటూనే అనేక పద్ధతులను అనుసరిస్తారు. ఇంకా కొందరు కొన్ని చిట్కాలను సైతం పాటిస్తారు. ఈ క్రమంలోనే భోజనానికి ముందు నీళ్లు తాగితే బరువు తగ్గుతారని చాలా మంది సలహా ఇస్తుంటారు. మరి ఇందులో నిజమెంత? ఈ అంశంపై హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ సీనియర్ ఫ్యాకల్టీ ఎడిటర్ Robert H. Shmerling వివరించారు. ఆయన చెబుతున్న మాటలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కడుపు నిండిన ఫీలింగ్
భోజనానికి ముందుగా నీటిని తాగడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అయితే, మన కడుపులో అనేక నరాలు ఉంటాయని.. ఇవి నీటిని తాగినప్పుడు సాగి మెదడుకు ఆహారాన్ని తీసుకోవద్దని సిగ్నల్స్ పంపుతాయని వివరించారు. ఫలితంగా ఆహారం తక్కువగా తీసుకుని బరువు తగ్గుతామని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయం అనేక పరిశోధనల్లోనూ వెల్లడైంది. భోజనానికి ముందు నీరు తాగని వారితో పోలిస్తే నీరు తాగిన వారు ఆహారాన్ని తక్కువగా తీసుకున్నట్లు తేలింది. మరో పరిశోధనలోనూ లో క్యాలరీ డైట్ తీసుకుంటూ భోజనానికి ముందు నీటిని తాగని, తాగినవారినీ పరిశీలించారు. సుమారు 12 వారాలు పరిశీలించగా.. నీరు తాగనివారితో పోలిస్తే తాగినవారు బరువు తగ్గినట్లు బయటపడింది.
ఆకలి వేసినా నీరు తాగితే సరిపోతుంది
మనకు చాలా సార్లు ఏదైనా తినాలనిపించడం, ఆకలి వేస్తుంటుంది. అయితే, ఇది అన్ని సార్లు ఆకలి కాదని కొన్ని సార్లు దాహం వేసి కూడా ఇలా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో కొన్ని నీటిని తాగడం వల్ల అనవసర క్యాలరీల జోలికి పోకుండా ఉంటామని వివరించారు. ఎక్కువ ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల బరువు కూడా తగ్గే అవకాశం ఉంటుందని అంటున్నారు.
వ్యాయామం చేసే ముందు నీరు తాగాలి
వ్యాయామం చేసే సమయంలో చాలామంది కండరాలు పట్టేయడం, అలసట, తిమ్మిర్లతో ఇబ్బంది పడుతుంటారు. దీనికి కారణం శరీరం డీ హైడ్రేషన్ కావడమేనని నిపుణులు వెల్లడిస్తున్నారు. అందుకే వ్యాయామం చేసే ముందు తప్పనిసరిగా నీటిని బాగా తీసుకుని శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలని తెలిపారు.