How to Make Chinthakaya Kobbari Pachadi: "చింతకాయ పచ్చడి.." తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు. వేడి వేడి అన్నంలో కొద్దిగా పచ్చడి, కమ్మని నెయ్యి వేసుకుని తింటే నిమిషాల్లో కంచాలు ఖాళీ కావాల్సిందే. పుల్లపుల్లగా, కారంగా ఉండే ఈ పచ్చడి రుచి అద్భుతం. అందుకే చాలా మంది సంవత్సరానికి సరిపడా నిల్వ పచ్చడి పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటుంటారు. అయితే, నిల్వపచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందో, పచ్చి చింతకాయ పచ్చడి అంతకు మించి అన్నట్టుగా ఉంటుంది. పైగా దీన్ని ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైమ్ కూడా అక్కర్లేదు. చాలా ఈజీగా పనైపోతుంది. మరి, ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానమేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
- లేత చింతకాయలు - 200 గ్రాములు
- కొబ్బరి ముక్కలు - 1 కప్పు
- పచ్చిమిర్చి - 6
- జీలకర్ర - అర టీ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- పసుపు - పావు టీ స్పూన్
తాలింపు కోసం:
- నూనె -2 టేబుల్ స్పూన్లు
- ఆవాలు - అర టీ స్పూన్
- జీలకర్ర - అర టీ స్పూన్
- శనగపప్పు - 1 టీ స్పూన్
- మినపప్పు - 1 టీ స్పూన్
- దంచిన వెల్లుల్లి రెబ్బలు - 4
- ఎండు మిర్చి - 3
- కరివేపాకు - 2 రెమ్మలు
తయారీ విధానం:
- లేత చింతకాయలను కొద్దిసేపు నీటిలో నానబెట్టి శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టాలి.
- ఒకవేళ మీరు ముదురు చింతకాయలు తీసుకుంటే వాటిని నీటిలో కాసేపు నానబెట్టి శుభ్రంగా కడిగి పీచు, పైపొట్టు తీయాలి.
- అలాగే లోపల ఉన్న గింజలు కూడా తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- మిక్సీజార్లో చింతకాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చివరగా పసుపు వేసి మరోసారి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోట్లో రుబ్బుకుంటే టేస్ట్ మరింత బాగుంటుంది.
- తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసి దోరగా వేయించుకోవాలి.
- ఆ తర్వాత దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి మరో రెండు నిమిషాలు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
- ఈ తాలింపును చింతకాయ మిశ్రమంలో కలిపితే సరి. ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ కొబ్బరి పచ్చడి. నచ్చితే మీరూ ట్రై చేయండి.
పుల్లపుల్లగా చింతకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి - ఇలా చేస్తే నోట్లో నీళ్లు ఊరుతాయి!
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు "పచ్చిమిర్చి ఉల్లిపాయ పచ్చడి" చేయండి - వేడివేడి అన్నంలోకి అద్దిరిపోతుంది!