Diet for Uric Acid:ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో యూరిక్ యాసిడ్‌తో వచ్చే గౌట్ ఒకటి. దీర్ఘకాలిక వ్యాధి అయిన గౌట్ వచ్చినవారిలో.. నొప్పులు తీవ్రంగా ఉంటాయి. దీనిని పూర్తిగా నయం చేయలేకపోయినప్పటికీ.. కొన్ని ఆహార జాగ్రత్తలు పాటించడం వల్ల వ్యాధి తీవ్రత నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు. ఈ సమస్యతో ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి ఆహారం తీసుకోకూడదు? ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ కారణాల వల్ల గౌట్ వస్తుందట!
మందులతో పాటు జీవనశైలి, ఆహార మార్పులు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తాయని ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ మల్లీశ్వరి చెబుతున్నారు. మనం తీసుకునే ఆహారంలో ఉండే ఫ్యూరిన్లు అనే పదార్థం వల్ల యూరిక్ యాసిడ్ రక్తంలో చేరుతుందని చెబుతున్నారు. మెటబాలిక్ డిజార్డర్, డీ హైడ్రేషన్ వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలు పేరుకుపోతాయని వివరిస్తున్నారు. ఇంకా మూత్ర పిండాలు సరిగ్గా పనిచేయలేకోపోవడం, ధైరాయిడ్ సమస్య వల్ల యూరిక్ యాసిడ్‌ను బయటకు పంపించడం కష్టంగా మారుతుందంటున్నారు. పురుషులు కంటే రెండు రెట్లు మహిళలు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.
తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు
- నట్స్
- పుట్టగొడుగులు
- పాలకూర
- మజ్జిగ
- ద్రాక్ష పండ్లు
- కమలా పండ్లు
- అనాస పండ్లు
- స్ట్రాబెర్రీ
- అవకాడో
- చెర్రీలు
- చిక్కుళ్లు
ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలట!
గౌట్ సమస్యతో బాధ పడుతున్నవారు తప్పనిసరిగా బరువును అదుపులో ఉంచుకోవాలని డాక్టర్ మల్లీశ్వరి చెబుతున్నారు. ఆల్కహాల్, స్మోకింగ్, చేపలతో పాటు సీ ఫుడ్, మాంసానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. యూరిక్ యాసిడ్ శరీరం నుంచి బయటకు వెళ్లాలంటే ఒంట్లో నీటి శాతం ఎక్కువగా ఉండాలని వివరిస్తున్నారు. ఇందుకోసం రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తీసుకోవడం మేలు చేస్తుందని అంటున్నారు. ఇంకా మనం తీసుకునే ఆహారంలో ద్రవాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఇంకా కొందరు ప్రోటీన్ కోసం మాంసాహారం, చేపలు ఎక్కువగా తీసుకుంటుంటారు. కానీ గౌట్ సమస్య ఉన్నవారు.. వీటికి వీలైనంత మేరకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పాటు ముఖ్యంగా మద్యం తాగే అలవాటు ఉన్నవారు.. పూర్తిగా మానేయాలని సలహా ఇస్తున్నారు. మద్యం కారణంగా శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి 6.5 పెరుగుతుందని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.