PM Modi Fires On Aam Aadmi Party : ఆమ్ ఆద్మీ పార్టీ దిల్లీకి ఆపదగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఆపద పదేళ్ల నుంచి దేశ రాజధానిని తన గుప్పిట్లోకి తీసుకుందని దుయ్యబట్టారు. ఆప్ పాలన ఇంకా కొనసాగితే దిల్లీ పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దిల్లీలో గృహ, విద్యా రంగాలకు చెందిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేసిన అనంతరం రాంలీలా మైదానంలో జరిగిన సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ క్రమంలో ఆప్, దిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై మండిపడ్డారు.
"ఒకవైపు దిల్లీ అభివృద్ధి కోసం కేంద్రం చాలా ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు దిల్లీలోని ఆప్ సర్కార్ కేంద్రంపై అబద్ధాలు ప్రచారం చేస్తోంది. పాఠశాల విద్య, కాలుష్యంపై పోరాటం, మద్యం వ్యాపారం వరకు అనేక రంగాల్లో ఆప్ సర్కార్ అవినీతికి పాల్పడుతోంది. దిల్లీలో ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆపద ప్రభుత్వం కేంద్రంపై యుద్ధం ప్రారంభించింది. దాని నుంచి బయటపడాలని నిర్ణయించుకున్నాను"
-- నరేంద్ర మోదీ, భారత ప్రధాని
'బీజేపీ విజయంతో సమస్యలన్నీ తీరిపోతాయి'
ఆపద ప్రభుత్వాన్ని దిల్లీ నుంచి తరిమికొట్టాలని ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. దిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంతో ప్రజల సమస్యలన్నీ తీరిపోతాయని అన్నారు. సిగ్నేచర్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలను ఆప్ సర్కార్ అమలు చేయకపోవడం వల్ల, తాను ఎంత ప్రయత్నించినా దేశ రాజధాని వాసులకు పూర్తిగా సాయం చేయలేకపోయానని తెలిపారు. దిల్లీలో హైవేల నిర్మాణం, పేదలకు ఇళ్లు కట్టించడంలో ఆప్ ప్రభుత్వం పాత్ర పెద్దగా లేదని ఎద్దేవా చేశారు.
కేజ్రీవాల్ పై విమర్శలు
దిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ప్రధాని మోదీ విమర్శనాస్త్రాలు సంధించారు. కొందరిలా తాను శీష్ మహల్(కేజ్రీవాల్ అధికారిక నివాసాన్ని ఉద్దేశించి) నిర్మించుకోలేదని, పేదల కోసం ఇళ్లు కడుతున్నానని ఎద్దేవా చేశారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ ఇళ్లు ఉండేలా చూడాలన్నదే తన కల అని అన్నారు. ఆప్ అవినీతి పార్టీ అని, తప్పుడు హామీలు ఇస్తోందని మండిపడ్డారు.
#WATCH | Delhi | Addressing a public meeting in Ashok Vihar's Ramlila Ground, PM Narendra Modi says, " when i am here today, it's obvious to remember many old memories. when the country was fighting against indira gandhi's dictatorship, for many people like me who were part of the… pic.twitter.com/GC6PUJ0qoE
— ANI (@ANI) January 3, 2025
పేదల కోసం పలు పథకాలు
"గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం పేదలకు 4కోట్ల ఇళ్లు నిర్మించింది. మురికివాడల్లో నివసించే వారికి పక్కా ఇళ్లు నిర్మించాలన్నదే నా లక్ష్యం. 2025 దేశానికి అనేక కొత్త అవకాశాలను ఇస్తుంది. కొత్త ఏడాదిలో భారత్ పెద్ద ఉత్పాదక కేంద్రంగా ఎదుగుతుంది. వ్యవసాయ రంగం, మహిళల సారథ్యంలోని అభివృద్ధిలో కొత్త రికార్డులు నమోదు అవుతాయి. 2025లో భారత్ గ్లోబల్ స్టాండింగ్ ఇమేజ్ ను మరింత బలోపేతం చేసుకుంటుంది. పేదలు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలో గృహాలను అందించడానికి ఎన్ డీఏ సర్కార్ ప్రాధాన్యత ఇస్తుంది. తదుపరి దశలో పట్టణ పేదల కోసం కోటి కొత్త ఇళ్లు నిర్మిస్తాం. మధ్యతరగతి ప్రజలు సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గృహ రుణ వడ్డీ రేటులో రాయితీని ఇస్తోంది" అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ
దిల్లీలోని అశోక్ విహార్‌లోని స్వాభిమాన్ అపార్ట్ మెంట్లో జేజే క్లస్టర్ల నివాసితుల కోసం కొత్తగా నిర్మించిన 1,675 ఫ్లాట్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ క్రమంలో లబ్దిదారులకు ఇంటి తాళాలను అందజేశారు. నజఫ్ గఢ్ లోని రోషన్ పురాలో వీర్ సావర్కర్ కాలేజీకి కూడా మోదీ శంకుస్థాపన చేశారు.
'దిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి'
దిల్లీలోని ఆపద సర్కార్‌ను సహించబోమని దిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా విమర్శించారు. బీజేపీ సర్కార్ అధికారంలోకి వస్తే దిల్లీని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని నగరంగా మార్చాలనుకుంటుందని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం దిల్లీలో రావాలని అభిప్రాయపడ్డారు. "యమునా నది పరిస్థితి ఏంటో చూడండి. స్వచ్ఛ యమునా ఆలోచనతో ముందుకు సాగుతాం. పార్టీ నాకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. ఒక్క సీటులో పోటీ నాకు ముఖ్యం కాదు. మొత్తం 70 సీట్లు నాకు ముఖ్యమే" అని వీరేంద్ర సచ్ దేవా వ్యాఖ్యానించారు.
మోదీ వ్యాఖ్యలకు ఆప్ కౌంటర్
మరోవైపు, తమ ప్రభుత్వంపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆప్ స్పందించింది. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి ప్రకటనలు సరికాదని అభిప్రాయపడింది. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని కేజ్రీవాల్ అన్నారు. లేకుంటే ప్రధాని మోదీ తన 43 నిమిషాల ప్రసంగంలో 39 నిమిషాల పాటు రాజధాని ప్రజలను తిట్టడానికి కేటాయించాల్సిన అవసరం ఉండేది కాదని విమర్శించారు. బీజేపీ కేవలం దుర్వినియోగం రాజకీయాలు, వ్యక్తిగత దాడులకు మాత్రమే పాల్పడుతుందని ఆరోపించారు.
గడిచిన 10ఏళ్లలో కేంద్ర ప్రభుత్వానికి దిల్లీ పాలనలో సగభాగస్వామ్యం ఉందని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. దిల్లీలో మురుగునీటి వ్యవస్థ, నీటి సరఫరా, విద్యుత్తును మెరుగుపరచడానికి ఆప్ సర్కార్ కృషి చేసిందని పేర్కొన్నారు. బీజేపీ సర్కార్ దిల్లీ అభివృద్ధికి గత 10 ఏళ్లలో ఏం చేసిందని ప్రశ్నించారు. దిల్లీలోని వ్యాపారులకు బెదిరింపుల కాల్స్ వస్తున్నాయని, పట్టపగలే హత్యలు జరుగుతున్నాయని విమర్శించారు. దానికి బీజేపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.