Diabetes Skin Problems : ఈ కాలంలో షుగర్ వ్యాధి నిశబ్ద సునామీలా మారుతోంది. ఉరుముల్లేని పిడుగుల్లా విరుచుకుపడుతూ తల నుంచి గోటి దాకా మొత్తం శరీరాన్ని వ్యాధుల కుపంటిలా మారుస్తుంది. ఈ భయానక వ్యాధిని ఒక్క మాటలో సైలెంట్ కిల్లర్‌గా చెప్పవచ్చు. జబ్బు ఏదైనా దాని ప్రభావం ముందుగా మన చర్మంపైనే చూపిస్తుందనేది వాస్తవం. నూటికి 70 మంది మధుమేహం వ్యాధిగ్రస్తుల్లో ఏదో ఒక చర్మ సమస్య కనిపిస్తుందని చెబుతున్నారు డాక్టర్లు. దీని వల్ల షుగర్ దాడి మన చర్మంపై ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో షుగర్ వల్ల మన చర్మానికి ఎదురయ్యే చిక్కులు, వాటిని నివారించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చర్మం మన ఒంటికి రక్షణ కవచం మాత్రమే కాదు చక్కటి ఆరోగ్యానికి చిరునామా కూడా. డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు కళ్లు, నోటితో పాటు మన చర్మాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం చాలా మందికి అనుభవమే. ఎందుకంటే మన ఒంట్లోని అనారోగ్యం తాలూకు లక్షణాలు చర్మంపై చాలా వరకు ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఈ సంకేతాలను పసిగట్టడం ద్వారా వైద్యులు చాలా వరకు అనారోగ్యాన్ని అంచనా వేస్తుంటారు. షుగర్‌తో బాధపడేవారి చర్మంలో కూడా అనేక లక్షణాలు కనిపిస్తాయి. నూటికి 70 శాతం మంది వ్యాధిగ్రస్థుల్లో చర్మానికి సంబంధించి ఏదొ ఒక సమస్యతో బాధపడుతున్నారని పరిశోధనలు చెబుతున్నాయి.
చర్మంపై దురదలు ఎందుకు వస్తాయి?
రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువ అవ్వటం వల్ల దాన్ని బయటకు పంపేందుకు శరీర కణాల్లోని నీరును ఉపయోగించుకుంటుంది. తద్వారా షుగర్ పేషెంట్స్ ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ‌్తుంటారు. ఈ కణాల్లో నీరు తగ్గడం వల్ల శరీరం పొడిబారి దురద ప్రారంభమవుతుంది. ఫైటో కైన్స్ అనే ఇన్ఫ్లమేటరీ కణాలు అధికం కావడం వల్ల కూడా శరీరంలో దురదలు రావడాన్ని చూడవచ్చు. ఇలాంటి సమస్యతో బాధపడేవారు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఇవే.
- చలికాలం రాకముందే మన శరీరానికి సరిపోయే మాయిశ్చరైజర్లు వాడాలి. దానికన్నా ముందు చర్మానికి కొబ్బరినూనెను రాసుకోవాలి. అయితే రంగులు, ప్రిజర్వేటివ్‌లు లాంటి రసాయనలు లేకుండా ఉన్నవి మాత్రమే వినియోగించండి.
- రోజుకు కనీసం 9 గ్లాసుల నీళ్లు తాగండి.
- తడి బట్టలు వేసుకోవడం మానేయండి.
- అధిక చెమట పట్టే పనులు చేయకుండా ఉండటమే మేలు.
- వీలైనంత వరకు వేడినీళ్లతో కాకుండా చన్నీటితో స్నానం చేసేందుకు చూడండి.
- ఎక్కువ నురగ వచ్చే సబ్బులు వాడకండి.
- ఒమెగా ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను మీ డైట్లో చేర్చుకోండి.
బాడీకి సిగ్నల్స్ ఇస్తుంది!
సాధారణంగా షుగర్ వ్యాధితో బాధపడేవారి రక్తంలో గ్లూకోజ్ శాతం అధికంగా ఉంటుంది. అయితే దీని బారిన పడకముందు చర్మం మనకు కొన్ని రకాల సంకేతాలను ఇస్తుంది. అవేంటంటే?
- అరికాళ్లు, అరిచేతులు, మోకాళ్లు దగ్గర చర్మం పొడిబారుతుంది. తద్వారా దురద ప్రారంభమవుతుంది.
- చంకలు, ఛాతీ లాంటి జాయింట్స్ ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్లు సోకుతాయి.
- రక్తంలో యూరియా శాతం పెరగడం వల్ల కూడా చర్మంపై దురదలు వస్తుంటాయి.
- శరీరానికి సరిపడా నీరు తీసుకోకున్నా దురదలు వచ్చే అవకాశం ఉంది.
పరిష్కారం లేదా?
డయాబెటిస్ పేషెంట్లకు ఎక్కువగా చీము, పొక్కులు, రాచపుండ్లు, కాళ్లల్లో వాపు రావడం, పులిపిర్లు, చంకల్లో ఇన్ఫెక్షన్లు లాంటి సమస్యల బెడద ఉంటుంది. ఇందుకోసం తగిన యాంటిబయోటిక్ మందుల్ని వాడితే సరిపోతుంది. తద్వారా ఈ రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. షుగర్‌తో బాధపడేవారు తరచూగా లివర్, కిడ్నీ సహా ఇతర వైద్యపరీక్షలు చేయించుకోవడం ద్వారా చర్మ సంబంధిత సమస్యల నుంచి జాగ్రత్త పడవచ్చు.