Diabetes Reversing Drug : షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారికి గుడ్‌న్యూస్. కేవలం మూడు నెలల వ్యవధిలో ఘగర్ సమస్యను పరిష్కరించేలా ఓ ఔషధాన్ని రూపొందిస్తున్నారు శాస్త్రవేత్తలు. తాజాగా డయాబెటిస్ రివర్సింగ్ ఔషధంతో ఎలుకలపై చేసిన ప్రయోగం విజయవంతమైంది. కేవలం మూడు నెలల్లోనే 700శాతం ఇన్సులిన్ సెల్స్‌ను ఉత్పత్తి చేసినట్లు పరిశోధకులు తెలిపారు. అమెరికాలోని మౌంట్ సినాయ్, సిటీ ఆఫ్ హోప్ వైద్య పరిశోధనా సంస్థల సంయుక్త అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ అధ్యయనం కోసం టైప్ 1, టైప్ 2 మధుమేహంతో బాధపడుతున్న ఎలుకలను ఎంపిక చేశారు.
మనిషి శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ హెచ్చుతగ్గులకు గురైనప్పుడు వాటిని కంట్రోల్ చేసేందుకు క్లోమంలో(Pancreas) ఉండే బీటా కణాలు ఇన్సులిన్‌ను విడుదల చేస్తాయి. షుగర్ వ్యాధి తీవ్రరూపు దాల్చాక ఇవి పనిచేయడం ఆపేస్తాయి. అందుకే మ్యానువల్‌గా ఇన్సులిన్ ఇంజెక్షన్లు వేయించుకోవాల్సిన పరిస్థితి తీవ్ర మధుమేహ రోగులకు వస్తుంటుంది.
ప్రయోగం జరిగింది ఇలా
ఎలుకలపై జరిపిన ప్రయోగంలో భాగంగా చిన్న మొత్తంలో మానవ బీటా కణాలను ఎలుకల్లోకి ప్రవేశపెట్టారు. అనంతరం ఆ ఎలుకల్లోకి హార్మైన్ అనే అణువును ఇంజెక్ట్ చేశారు. హార్మైన్ అనేది కొన్ని మొక్కల ఆకుల్లో ఉండే సహజ అణువు. మానవ బీటా కణాల్లోని DYRK1A ఎంజైమ్‌ను నిరోధించే పనిని హార్మైన్ చేయగలదు. ఒకరకంగా చెప్పాలంటే హార్మైన్ అణువు వెళ్లి బీటా కణాలను గాడిలో పెడుతుంది. ఆ తర్వాత ఆ ఎలుకలకు డయాబెటిస్ ఔషధం GLP1 రిసెప్టర్ అగోనిస్ట్‌ను అందించారు. ఇది ఓజెంపిక్ అనే షుగర్ ఔషధ తరగతికి చెందినది.