Dangerous Things In Kitchen :ఆడవాళ్లు ఎక్కువ సమయం గడిపేది వంట గదిలోనే. వంట చేస్తూ, అంట్లు తోముతూ, శుభ్రం చేస్తూ ఇలా చాలా తమకున్న విలువైన సమయాన్ని చాలా వరకూ కిచెన్ లోనే గడపాల్సి వస్తుంది. దీంతో పాటు మీరు వండుకునే ఆహారంపై బ్యాక్టీరియా చేరకుండా సురక్షితంగా తాజాగా ఉండేందుకు కిచెన్ ను, వంట సామగ్రిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకుంటారు. అయితే మీరు ఎంత శుభ్రం చేసినా మీకు తెలియకుండా చాలా బ్యాక్టీరియాను పోగు చేసుకుని హాని కలిగించే కొన్ని వస్తువులు మీ వంట గదిలో ఉన్నాయంటే మీరు నమ్ముతారా? అవేంటో తెలుసుకున్నాక నమ్మక తప్పదు లెండి!
స్పాంజీలు
కిచెన్లో నీళ్లు, పాలు వంటివి వలికిపోయినప్పుడు వెంటనే దాన్ని పీల్చుకోవడానికి స్పాంజీలను వాడుతుంటాం. ఇవి చాలా హానికరమైన బ్యాక్టీరియాలను పోగేసుకుంటాయట. వీటిని మీరు నీటితో ఎంత కడిగినా వాటి లోతుల్లో ఉండే క్రిములు అస్సలు బయటకు వెళ్లవట. కాబట్టి వాటిని కూడా చక్కగా సర్ఫ్ లిక్విడ్‌లో నానబెట్టి ఉతకడం, లేదా కాసేపు మెక్రోవేవ్‌లో ఉంచడం లాంటివి చేయాలట.
స్టవ్ బండ(కౌంటర్ టాప్స్)
మీ కిచెన్ లో మీరు అన్నింటికన్నా ఎక్కువగా ఉపయెగించేది ఇదే. మీరు వంట చేసేటప్పుడు, చేసిన తర్వాత వీటి మీద పడే ఆహార పదార్థాలు చాలా సార్లు రోజంతా అలాగే ఉంటాయి. అవి అలాగే పేరుకుపోతాయి. కాబట్టి ప్రతి సారి శానిటైజ్ చేయడం మర్చిపోకండి.
చపాతీ పీట
ప్రతి వంటగదిలోనూ తప్పకుండా వాడే చపాతీ పీట లేదా రోలింగ్ ప్యాడ్‌ను వాడిన తర్వాత శుభ్రం చేయడం తప్పనిసరి. ఇవి చెక్కతో తయారు చేసినవి కాబట్టి పిండి పదార్థాలు వీటిపై ఎక్కువ సేపు ఉంటే బ్యాక్టీరియాకు కారణమవుతాయి.
ఉప్పు డబ్బా
చాలా సార్లు కూరలో ఉప్పు తగ్గిందంటూ భోజనం మధ్యలోనే ఉప్పు డబ్బాను తెచ్చుకుని కలుపుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు చేతుల నుంచి డబ్బాకు అంటుకున్న ఆహార పదార్థాలు హానికరమైన బ్యాక్టీరియాగా మారే అవకాశాలున్నాయి. కాబట్టి అంటిన వెంటనే వీటిని శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకొండి.