NTR Neel Movie : గతేడాది 'దేవర'తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇప్పుడాయన బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి 'వార్ 2' చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుంది. దీంతో ప్రస్తుతం ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందనున్న సినిమాపై అందరి దృష్టి మళ్లింది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ ప్రాజెక్ట్ ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. మరి సినిమా ఎప్పుడు షురూ అవుతుందా? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్ వచ్చేసింది!
ఈ సినిమా షూటింగ్ అప్డేట్ వచ్చింది. జనవరి 17న అధికారికంగా సినిమా చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. జనవరి 17 నుంచి కర్ణాటకలోని మంగళూరులో ఈ మూవీ షూటింగ్ తొలి షెడ్యూల్ మొదలవ్వనున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్‌పై సీన్లు చిత్రీకరించనున్నట్లు తెలిసింది. ఏడు నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత డబ్బింగ్, ఇతర కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను బరిలో దించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
విదేశాల్లోనూ షూటింగ్!
శ్రీలంక, మెక్సికో, ఉక్రెయిన్ సహా పలు దేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టుకు దాదాపు 100 రోజులు డేట్స్ ఇచ్చారట. ఈ సినిమా పీరియాడికల్- యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. అందుకే ప్రీ ప్రొడక్షన్ పనులకే దాదాపు ఏడాది పట్టింది. చిత్ర నిర్మాతలు కథకు ప్రాణం పోసేందుకు భారీ సెట్లు వేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్లో తారక్ మునుపెన్నడూ చేయని శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఆయనకు జోడీగా రుక్మిణీ వసంత్ కనిపించనుందని ప్రచారం సాగుతోంది. అలాగే మాలీవుడ్ స్టార్లు టొవినో థామస్, బిజు మీనన్ కీలక పాత్రలు పోషించనున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీస్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది.
పాన్ ఇండియా స్టార్ తారక్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతుండడం వల్ల ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా టైటిల్ నుంచి తారాగణం, కథ వరకూ ఎలాంటి క్లూస్ ఇవ్వకపోవడం చిత్రంపై ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. ముఖ్యంగా సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతుంతో తెలుసుకోవాలని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.
'NTR 31' షూటింగ్ అప్డేట్ - ఆ షెడ్యూల్లో తారక్ ఉండరట! - Jr Ntr 31 Shooting Update
ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ హీరోయిన్ ఆమెనేనా? - NTR Prasanth Neel Film Heroine