Milk Help in Weight Loss: మనలో చాలా మంది బరువు తగ్గేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యాయామంతో పాటు ముఖ్యంగా పలు రకాల ఆహార జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే పాలు తాగితే బరువు తగ్గుతారని కొందరు అంటుంటారు. మరికొందరెమో అందులో కొవ్వు ఉంటుందని.. తాగకూడదని చెబుతుంటారు. కానీ, నిజానికి బరువు తగ్గటంలో పాలు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. 2019లో Nutrients జర్నల్‌లో ప్రచురితమైన Dairy consumption and weight loss: a systematic review and meta-analysis of randomized controlled trials అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
కండరాలు తగ్గకుండా బరువు తగ్గాలంటే ఆహారంలో ప్రొటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని నిపణులు చెబుతున్నారు. ఈ విషయంలో పాలు మేలు చేస్తాయని.. వీటిల్లో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుందని వివరిస్తున్నారు. ఇంకా విశ్రాంతి సమయంలో కేలరీలు ఎక్కువగా ఖర్చు కావటానికీ ప్రొటీన్ తోడ్పడుతుందని అంటున్నారు. ఆహార నియమాలు పాటించే సమయంలో రోజువారీ అవసరమైన పోషకాలు తగ్గకుండా చూసుకోవటం కూడా ముఖ్యమేనని పేర్కొన్నారు. ఇందుకు పాలలోని పోషకాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
ఒక గ్లాసు ఆవు పాలు తాగడం వల్ల 122 కేలరీల శక్తి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ప్రొటీన్ 8.23 గ్రాములు, పిండి పదార్థాలు 12 గ్రాములు, కొవ్వు 4.66 గ్రాములు, క్యాల్షియం 309 మిల్లీగ్రాములు, మెగ్నీషియం 29.4 మిల్లీగ్రాములు, పొటాషియం 390 మిల్లీగ్రాములు, జింక్ 1.05 మిల్లీగ్రాములు, ఫోలేట్ 4.9 మైక్రో గ్రాములు, కొలీన్ 44.6 మిల్లీగ్రాములు, విటమిన్ బి12 1.35 మైక్రో గ్రాములు, విటమిన్ ఏ 203 మైక్రో గ్రాములు, విటమిన్ డి 111 ఐయూ లభిస్తాయని వివరిస్తున్నారు. ఇంకా ఎముకలు బలోపేతం కావటానికి, రోగనిరోధకశక్తి, జీవక్రియల వేగం పెరగటానికి ఇవి తోడ్పడతాయని అంటున్నారు.
తక్కువ కేలరీల ఆహారం తీసుకునేవారిలో రోజుకు మూడుసార్లు పాల పదార్థాలను తిన్నవారు మరింత బరువు తగ్గినట్టు పరిశోధకులు వివరిస్తున్నారు. బరువు తగ్గిన తర్వాత ఆహారంలో పాల పదార్థాలు ఎక్కువగా తీసుకునేవారిలో బరువు సమర్థంగా అదుపులో ఉంటున్నట్టూ చెబుతున్నారు. ఇంకా వీరిలో నడుము చుట్టుకొలత కూడా తగ్గిందని అంటున్నారు. పైగా పాలలో ఉండే క్యాల్షియంతో.. ఊబకాయం, జీవక్రియల రుగ్మత, మధుమేహం వంటి వాటి ముప్పులూ తగ్గే అవకాశముందని పేర్కొన్నారు.
అయితే, పాలలో కొవ్వు ఉంటుందని.. ఇది మంచిదని కొందరు, చెడ్డదని మరికొందరు చెబుతూ వస్తున్నారు. కేవలం ఆవు, బర్రె పాలలోనే కాకుండా.. కొబ్బరి పాల వంటి శాక సంబంధ పాలలోనూ సంతృప్త కొవ్వు ఉంటుందని నిపుణులు అంటున్నారు. అందుకే వెన్న తీసిన పాలు తాగటం ఆరోగ్యానికి మంచిదని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతోంది. ఇందులో ప్రొటీన్‌తో పాటు పాలలో కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుందని అంటున్నారు. ఫలితంగా ఇది బరువు తగ్గటానికి తోడ్పడుతుందని చెబుతున్నారు. ఇంకా లాక్టోజ్ పడనివారు కూడా దీన్ని తీసేసిన పాలను ఎంచుకోవచ్చని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
నూడుల్స్, చిప్స్ తినడం మానలేకపోతున్నారా? ఇలా చేస్తే జంక్ ఫుడ్ మొత్తం ఆపేస్తారట!