Cracked Heels Treatment at Home: మనలో చాలా మందిలో పాదాలు పగుళ్లు సమస్య కనిపిస్తుంటుంది. ముఖ్యంగా నడిచేటప్పుడు ఈ సమస్య చాలా ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇలా బాధించడమే కాకుండా.. చూడ్డానికీ బాగోవు. దీంతో పగుళ్ల సమస్య పరిష్కారం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వివిధ రకాలైన క్రీములు, మందులు వాడుతుంటారు. అయితే, ఈ సమస్యకు ఆయర్వేదంలో చక్కని పరిష్కార మార్గం ఉందని ప్రముఖ వైద్యురాలు గాయత్రీ దేవీ చెబుతున్నారు. మరి ఈ ఔషధం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- 50 గ్రాముల సుగంధి పాల చూర్ణం
- 50 గ్రాముల మంజిష్ట చూర్ణం
- 50 గ్రాముల నువ్వుల నూనె
- 50 గ్రాముల తెల్ల గుగ్గిలం
తయారీ విధానం
- ముందుగా స్టౌ ఆన్ చేసి ఓ గిన్నెలో నీరు పోసి వేడి చేసుకోవాలి.
- నీళ్లు వేడయ్యాక సుగంధిపాలు, మంజిష్ట చూర్ణాన్ని ఇందులో వేసి కలిపి సన్నటి మంటపై మరగనిచ్చి ఆ తర్వాత జల్లిగంటెతో వడకట్టుకోవాలి.
- ఇప్పుడు మరో గిన్నెను వేడి చేసుకుని అందులో వడపోసుకున్న కషాయాన్ని పోయాలి.
- దీనిలోనే నువ్వుల నూనె పోసుకుని సన్నని మంటపై మరిగించుకోవాలి.
- నీరంతా ఆవిరై నూనె మిగిలిన తర్వాత తెల్ల గుగ్గిలం పొడిని అందులో కలపాలి.
- ఇలా సుమారు 5 నిమిషాలు మరిగించుకున్న తర్వాత స్టౌ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకుంటే ఔషధం రెడీ
- ఈ ఔషధాన్ని రాత్రి పూట పాదాలకు ఎక్కువ పరిమాణంలో రాసి రాత్రి మొత్తం ఉంచుకోవాలని గాయత్రీ దేవీ తెలిపారు. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం వేడి నీటిలో పోసుకుని అందులో రాళ్ల ఉప్పు వేసి పాదాలను పెట్టి క్లీన్ చేసుకోవాలని చెబుతున్నారు. ఇలా రోజుకు ఒకసారి చేయడం వల్ల పాదాల పగుళ్లను సులభంగా తగ్గించుకోవచ్చని అంటున్నారు.
సుగంధి పాల:ఇది పాదాల పగుళ్లను తగ్గించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందని గాయత్రీ దేవీ చెబుతున్నారు. మృత కణాలు పోయి కొత్త కణాలు రావడానికి సాయం చేస్తుందని వివరించారు. చాలా ఔషధాల తయారీలో దీనిని వాడుతామని తెలిపారు.