Chewing Gum Health Benefits : ఒత్తిడి అందరిలో ఉంటుంది. కానీ.. దాన్ని సాధ్యమైనంత తక్కువగా ఉండేలా చూసుకోవడమే మనం చేయాల్సింది. లేకపోతే.. లాంగ్ టైమ్‌లో మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే.. తాత్కాలికంగా స్ట్రెస్‌ను తగ్గించుకునే మార్గం ఒకటుందని నిపుణులు సూచిస్తున్నారు. అదే.. 'చూయింగ్ గమ్' నమలడం!
చాలా మంది సరదాకోసం చూయింగ్ గమ్ నములుతుంటారు. కానీ.. దీని ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. క్రీడాకారులు మైదానంలో నమిలేది అందుకేనట! 'చూయింగ్ గమ్'పై "నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్" (NCBI) జరిపిన పరిశోధనలో కూడా ఈ విషయం వెల్లడైంది. చూయింగ్ గమ్ నమలడం వల్ల ఒత్తిడి తగ్గడంతోపాటు ఇంకెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని పరిశోధకులు తెలిపారు.
NCBI పరిశోధనల ప్రకారం.. ఒత్తిడి, ఆందోళన నివారించడంలో చూయింగ్ గమ్ శక్తివంతంగా పనిచేస్తుందట. దాంతో.. చేసే పనిపై మరింత దృష్టి పెరుగుతుందని.. ఫలితంగా సక్సెస్ రేటు పెరుగుతుందట. జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. పరీక్షలకు ముందు చూయింగ్ గమ్ నమలడం వల్ల.. విద్యార్థుల్లో ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయని, తద్వారా చక్కగా ఎగ్జామ్ రాస్తారని చెబుతున్నారు.
ఫిన్లాండ్ పరిశోధనల ప్రకారం.. జిలిటాల్ కలిగి ఉన్న చూయింగ్ గమ్ చెవి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందట. అదేవిధంగా.. చూయింగ్ గమ్ నమలడం.. ముఖ కండరాలకు వ్యాయామాన్ని అందిస్తుంది. శారీరకంగా శ్రమించే సమయంలో అథ్లెట్లకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందట.