Health Benefits of Black Foods : బ్లాక్ ఫుడ్స్ పేరు వినగానే చాలా మంది ఇవి నలుపు రంగులో ఉంటాయంటూ మొహం చిట్లించుకుంటారు. అయితే నిజానికి, ఆంథోసియనిన్ అనే పిగ్మెంట్లు ఉన్న పదార్థాలను బ్లాక్ ఫుడ్స్‌గా పరిగణిస్తుంటారు. ఈ పిగ్మెంట్లు నలుపు, నీలం, పర్పుల్ రంగు పదార్థాల్లో ఎక్కువగా ఉంటాయటున్నారు నిపుణులు. ఇక వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచి ఎలాంటి అనారోగ్యంతోనైనా సమర్థంగా పోరాడే శక్తిని శరీరానికి అందిస్తాయంటున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నల్ల బియ్యం :ఈ బియ్యం మనం రోజు తీసుకునే బియ్యంలా కాకుండా నల్లగా ఉంటాయి. ఈ ధాన్యంలో ఉండే ల్యూటిన్, జియాంథిన్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌తో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తాయంటున్నారు. ఈ రైస్‌తో బిరియానీ, పులావ్, పుట్టు, దోసె, ఇడ్లీ, ఖీర్ లాంటి వంటలను సైతం తయారుచేసుకోవచ్చు. సలాడ్‌లో భాగంగానూ తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
నల్ల పప్పు :మినుముల్నే నల్ల పప్పుగా వ్యవహరిస్తుంటారు. దాల్ మఖానీ, రోటీ, మినప సున్నుండలు లాంటి వంటకాలతో పాటు గ్రేవీల్లో కూడా ఈ పప్పును వాడుతుంటాం. ఈ పప్పు రుచితో పాటుగా, ఐరన్, ఫైబర్, ప్రొటీన్, ఫోలేట్, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పప్పును ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా శరీరంలో కొవ్వు స్థాయులను అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఇందులో ఉండే పొటాషియం రక్తప్రసరణను మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుందంటున్నారు.
నల్ల నువ్వులు:నల్ల నువ్వుల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బరువు పెరగాలనుకునే వారు నల్ల నువ్వులు తింటే మంచి ఫలితాలు వస్తాయంటున్నారు. నల్ల నువ్వుల్లో ఫైబర్, ప్రొటీన్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్ ఇ వంటి పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కీళ్ల నొప్పులతో పాటుగా వాపులు తగ్గించడానికి నల్ల నువ్వులు ఉత్తమ ఔషధంగా ఉపయోగపడుతాయని వైద్యులు సూచిస్తున్నారు.
నల్ల ద్రాక్ష: మలబద్ధకం, రక్తపోటు, జుట్టు నెరిసిపోవడం లాంటి సమస్యలకు నల్ల ద్రాక్ష ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగు పరచడంతో పాటుగా క్యాన్సర్ వ్యాధితో పోరాడేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, లివోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.