Best Foods For Hair Growthing : ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య.. జుట్టు రాలడం. అందుకు వంశపారంపర్యం, నిద్రలేమి, కలుషిత వాతావరణం, కఠినమైన జలం, ఒత్తిడి.. ఇలా అనేక కారణాలుండొచ్చు. వీటి గురించి జనాలు పట్టించుకోకుండా.. షాంపూలు, ఆయిల్స్, హెయిర్ మాస్క్లు అంటూ నెత్తిచుట్టూనే తిరుగుతుంటారు. కానీ, జుట్టు రాలే సమస్య(Hair Fall)తగ్గాలంటే నెత్తిన మాత్రమే ఎరువు వేస్తే సరిపోదు.. పొట్టలో పోషకాహారం రూపంలో వేయాలంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
జుట్టు రాలే సమస్య తగ్గాలంటే మీ డైలీ డైట్లో.. ఇవి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలంటున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్ లతాశశి. ముఖ్యంగా జుట్టు పెరుగుదలకి అవసరమయ్యే జింక్, ఐరన్, ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, సెలీనియం వంటి పోషకాలు మీ రోజూ వారి ఆహారంలో ఉండేలా ప్లాన్ చేసుకోవాలంటున్నారు. ఆ పోషకాలలో ఐరన్ కోసం ఆకుకూరలు.. తోటకూర, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మునగాకు వంటివి పొడుల రూపంలో తీసుకోవాలని చెబుతున్నారు. అలాగే.. 2015లో 'డెర్మటాలజీ' జర్నల్లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. ఐరన్ లోపం ఉన్నవారు అది ఎక్కువగా లభించే ఆకుకూరలు, ఇతర ఆహారాలు తీసుకున్న తర్వాత వారి జుట్టు పెరుగుదలలో గణనీయమైన పెరుగుదల ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.
జుట్టు పెరగడంలేదని బాధపడుతున్నారా? ఈ నూనెలు ట్రై చేస్తే రెండింతలు పెరగడం పక్కా!
ఇకపోతే జుట్టు రాలడాన్ని తగ్గించడంలో మాత్రమే కాకుండా శరీరానికి కావాల్సిన శక్తిని అందించడంలో ప్రొటీన్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. కాబట్టి, మీ శరీరానికి కావాల్సిన ప్రొటీన్ కంటెంట్ కోసం.. పప్పుదినుసులు, బఠాణీలు, బొబ్బర్లు, సెనగలు, రాజ్మా వంటి వాటిని తీసుకోవచ్చని లతాశశి సూచిస్తున్నారు. అదేవిధంగా జింక్ కోసం.. నట్స్, బీన్స్, చికెన్, మటన్, గుడ్డు వంటివి తీసుకోవచ్చంటున్నారు. ఇవేకాకుండా తక్కువ కొవ్వులుండే పాలు, పెరుగు, పనీర్ ద్వారా కూడా ప్రొటీన్ లభిస్తుందంటున్నారు. అయితే దీని మోతాదు మాత్రం మీ బరువుపై ఆధారపడి ఉంటుందని విషయాన్ని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.