Benefits of Breastfeeding to Mother and Baby: తల్లి స్తన్యం నుంచి వచ్చే పాలు బిడ్డకు అమృతంతో సమానం. ఆ పాలలో కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, ఎంజైమ్స్, విటమిన్స్, ఖనిజాలు, యాంటీబాడీలు, హార్మోన్లు, బయాయాక్టివ్ కాంపోనెంట్లు, పెప్‌టైడ్‌లు, ఇమ్యునోమోడ్యులేటర్లు ఇలా ఎన్నో ఉంటాయి. అయితే.. కొంతమంది తల్లులు పలు రకాల కారణాలతో పిల్లలకు పాలివ్వడం మానేస్తుంటారు. కొందరు మొదటి నుంచే పాలివ్వడం ఆపేస్తే.. మరికొందరు కొన్ని రోజులే పాలు ఇచ్చి, ఆ తర్వాత డబ్బా పాలు అలవాటు చేస్తుంటారు. ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు.
రోగనిరోధక వ్యవస్థ బలోపేతం:తల్లిపాలలో యాంటీబాడీలు, పెప్ టైడ్లు, ఇమ్యునోమోడ్యులేటర్లు ఉంటాయి. ఇవి శిశువు రోగనిరోధక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. తల్లిపాలు తాగే పిల్లలు చెవి ఇన్ఫెక్షన్లు, అతిసారం, న్యుమోనియా వంటి సాధారణ శిశువ్యాధులకు గురయ్యే అవకాశం తక్కువని నిపుణులు చెబుతున్నారు.
క్యాన్సర్ల ప్రమాదం తగ్గుతుంది : తల్లిపాలు తాగే పిల్లలకు లుకేమియా, లింఫోమా, బ్రెయిన్ ట్యూమర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం తక్కువని నిపుణులు అంటున్నారు. అలాగే టైప్ 1, టైప్ 2 మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువంటున్నారు.
తల్లికీ ఎంతో మేలు :తల్లి పాలు తాగడం వల్ల పాపాయికే కాదు.. పాలిచ్చే తల్లికీ ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు అంటున్నారు. బిడ్డ రొమ్ము పట్టినప్పుడు తల్లి మెదడు నుంచి సంకేతాలు వెలువడి.. ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది పాలు పడడానికే కాకుండా గర్భాశయం త్వరగా సంకోచించడానికీ దోహదం చేస్తుందని నిపుణులు అంటున్నారు. దీంతో కాన్పు తర్వాత రక్తస్రావమూ తగ్గుతుంది. మాతృ మరణాల్లో చాలావరకు రక్తస్రావం ఆగకపోవడమే ప్రధాన కారణమట.