These Foods Avoid after Workouts : ఆరోగ్యం కోసమో, అందం కోసమో డైలీ వ్యాయామాలు చేస్తుంటారు చాలా మంది. అందుకోసం వాకింగ్, రన్నింగ్, జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేయడం వంటివి ఎంచుకుంటారు. అయితే, బరువు తగ్గి మంచి ఫిట్నెస్ను సొంతం చేసుకోవాలంటే వ్యాయామం ఒక్కటే సరిపోదు.. అందుకు తగిన పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. అలాగని ఏది పడితే అది తింటే మొదటికే మోసం వస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా మీ శరీరాకృతిని మెరుగుపరచుకోవాలంటే.. వ్యాయామం తర్వాత ఇప్పుడు చెప్పబోయే ఆహారాలను(Foods) అస్సలు తీసుకోవద్దని సూచిస్తున్నారు నిపుణులు. లేదంటే, మీరు ఎంత వర్కౌట్ చేసినా నో యూజ్ అంటున్నారు. ఇంతకీ, వ్యాయామం తర్వాత తినకూడని ఆహార పదార్థాలేంటి? తినాల్సినవి ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అధిక చక్కెర పదార్థాలు : మీరు వ్యాయామం చేశాక కచ్చితంగా తినకూడని ఫుడ్స్.. హై షుగర్ ఫుడ్స్. ముఖ్యంగా స్వీట్స్ జోలికి అస్సలు వెళ్లకూడదంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. వీటిలో ఉండే శుద్ధి చేయని చక్కెర శరీరానికి హాని కలిగిస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా, బరువు పెరగడానికి దారి తీయవచ్చంటున్నారు నిపుణులు.
అధిక కొవ్వు పదార్థాలు :వ్యాయామం తర్వాత తగిన ఫలితం పొందాలంటే మీరు అధిక కొవ్వు ఉన్న పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా.. వేయించిన ఆహారాలను అస్సలు తినకూడదని సూచిస్తున్నారు. ఎందుకంటే.. ఈ కొవ్వు పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా మజిల్స్‌కు అవసరమైన పోషకాలను త్వరగా పొందలేరంటున్నారు నిపుణులు.
2015లో 'అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్' అనే జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. వ్యాయామం తర్వాత వేయించిన ఆహారాలు తినే వ్యక్తులు బరువు పెరుగుతారని, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని వెల్లడైంది. ఈ పరిశోధనలో పాల్గొన్న ప్రముఖ వైద్యుడు జాన్ స్మిత్.. వ్యాయామం చేశాక ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకునే వారు బరువు పెరుగుతారని ఆయన పేర్కొన్నారు.
అధిక ఉప్పు పదార్థాలు :వీటిని కూడా వ్యాయామం చేశాక అస్సలు తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ ఫుడ్స్‌లో ఉండే అధిక కంటెంట్ సోడియం శరీరం నుంచి మరింత నీరు కోల్పోవడానికి దారితీస్తుంది. అప్పటికే మీరు వ్యాయామం చేసేటప్పుడు చెమట రూపంలో తగినంత నీరు కోల్పోతారు. ఫలితంగా డీహైడ్రేషన్ తలెత్తవచ్చు. అంతేకాకుండా, కొన్ని జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుందంటున్నారు.
ప్రాసెస్ చేసిన ఆహారాలు : వ్యాయామం తర్వాత ఈ రకమైన ఆహారపదార్థాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఫాస్ట్‌పుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ జోలికి అస్సలు వెళ్లకూడదంటున్నారు. ఇవి మీకు వ్యాయామం చేయడం ద్వారా లభించే అన్ని ప్రయోజనాలను పోయేలా చేస్తాయని సూచిస్తున్నారు నిపుణులు. కాబట్టి వ్యాయామం తర్వాత వీటికి దూరంగా ఉండడం బెటర్ అంటున్నారు.