Millet Laddu Recipe in Telugu: చిరు ధాన్యాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే ప్రొటీన్లు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు నిరుపేదల ఆకలి తీర్చిన మిలెట్స్‌ను.. నేటి ఆధునిక జీవనంలో చాలా మంది తమ రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆరోగ్య రక్షణకు ప్రతి ఒక్కరు వీటిని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో చాలా మంది రాగి జావ, కొర్రల అన్నం, రాగి ఇడ్లీ లాంటి వంటకాలను తమ డైట్లో చేర్చుకుంటున్నారు. కానీ కొంత మంది వీటిని ఇలా తినడానికి ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి మిల్లెట్స్‌తో చేసే ఈ స్వీట్ లడ్డు బెస్ట్ ఆప్షన్. ఇంకా ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ సారి కొత్తగా తినాలని అనుకునే వారు చిరుధాన్యాలతో స్వీట్ చేసుకోండి. ఈ నేపథ్యంలోనే మిల్లెట్స్ లడ్డూ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- ఒక కప్పు కొర్రలు
- ఒక కప్పు రాగులు
- ఒక కప్పు సజ్జలు
- ఒక కప్పు అరికలు
- ఒక కప్పు సామలు
- ఒక కప్పు పెసరపప్పు
- ఒక కప్పు బార్లీ
- ఆరు కప్పుల తురిమిన బెల్లం
- కొద్దిగా యాలకుల పొడి
- వేయించడానికి సరిపడా నెయ్యి
- పావుకప్పు జీడిపప్పు
తయారీ విధానం
- ముందుగా స్టౌ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నెయ్యి వేడి చేసి జీడిపప్పును దోరగా వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు మరో ప్యాన్‌లో కొర్రలు, రాగులు, సజ్జలు, అరికలు, సామలు, పెసరపప్పు, బార్లీలను ఒకదాని తర్వాత ఒకటి విడివిడిగా వేయించుకొని చల్లార్చి పక్కకు పెట్టాలి.
- ఆ తర్వాత వీటన్నింటినీ కలిపి మిక్సీలో వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇందులోనే తురిమిన బెల్లం కూడా వేసి మళ్లీ గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకొని.. అందులో వేయించిన జీడిపప్పు, కరిగించిన నెయ్యి, యాలకుల పొడి వేసి బాగా కలపాలి.
- అనంతరం అరచేతులకు నెయ్యి రాసుకుంటూ ఈ మిశ్రమాన్ని లడ్డూల మాదిరిగా చుట్టుకోవాలి.
- ఇలా తయారైన లడ్డూలను గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే సుమారు 2-3 వారాల పాటు నిల్వ ఉంటాయి.
హెల్దీ టిఫిన్ 'స్ప్రౌట్స్ పోహా' - బ్యాచిలర్స్ కూడా ఈజీగా, ఫాస్ట్‌గా చేసుకోవచ్చు!
సండే స్పెషల్: ఎంతో రుచిగా ఉండే 'షాహి చికెన్ కుర్మా'- ఒక్కసారి తిన్నారంటే రుచి మర్చిపోరు!