Diabetics Can Drink Alcohol? : నేటి రోజుల్లో మధుమేహం చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే చాలా మంది షుగర్ కంట్రోల్లో ఉండేందుకు డైలీ మందులు వాడడమే కాకుండా కొన్ని ఆహార నియమాలను పాటిస్తుంటారు. కానీ, కొందరు మాత్రం ఒక పక్క మందులు వాడుతూనే.. వారికీ నచ్చినట్టు తినడం, తాగడం చేస్తుంటారు. అందులో భాగంగానే.. ఆల్కహాల్ కూడా సేవిస్తుంటారు. అయితే, మధుమేహం(Diabetes)ఉన్నవారు మద్యం తాగొచ్చా? ఒకవేళ తాగితే ఏమవుతుంది? దీనిపై నిపుణులు ఏమంటున్నారు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
డయాబెటిస్ ఉన్నవారు మద్యం తాగొచ్చా? అని అడిగితే.. ఎట్టిపరిస్థితుల్లో కూడా వారు మద్యం సేవించకూడదని అంటున్నారు జనరల్ ఫిజీషియన్ డాక్టర్ మనోహర్. మధుమేహానికి మద్యం తోడైతే అగ్నికి ఆజ్యం పోసినట్లేనని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. కొందరు మాత్రం కొద్దిగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయని అనుకుంటారని.. కానీ అది కేవలం అపోహ మాత్రమేనని సూచిస్తున్నారు.
"సాధారణంగా మధుమేహం ఉన్న వారిలో నాడులు దెబ్బతినే ముప్పు ఎక్కువ. అదే.. మద్యం(Alcohol)తాగితే ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. ఎంత ఎక్కువకాలం నుంచి డయాబెటిస్తో బాధపడుతుంటే అంత ఎక్కువగా నాడులు దెబ్బతినే ప్రమాదముంది. దీని మూలంగానే చాలామంది కాళ్లు చేతుల తిమ్మిర్లు, మంట పెట్టటం, సూదులు పొడిచినట్టు అనిపించటం వంటి లక్షణాలతో ఇబ్బందిపడుతుంటారు. దీనికి ఆల్కహాల్ కూడా తోడైతే సమస్య మరింత ఎక్కువవుతుంది. ఇంకాస్త త్వరగా నాడులు దెబ్బతినొచ్చు. కాళ్లు మొద్దుబారి, పుండ్లు పడొచ్చు. పుండ్లు మానకపోతే వేళ్లు, పాదాలు, కాళ్లు తొలగించాల్సి రావొచ్చు" - డాక్టర్ ఎస్.మనోహర్, జనరల్ ఫిజీషియన్.
డయాబెటిస్ ఉన్న వారు మద్యం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు డాక్టర్ మనోహర్. 2018లో 'డయాబెటిస్ కేర్ జర్నల్'లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. షుగర్ ఉన్న వారు మద్యం సేవించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు 30 శాతం పెరిగినట్లు పరిశోధకులు కనుగొన్నారు.