What Food Boosts Vitamin D: మనం ఆరోగ్యంగా ఉండడానికి, రోగనిరోధక శక్తిని మెరుగుపరచుకోవడానికి మనం తీసుకునే ఆహారం కీలకమని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా ఇమ్యూనిటీని పెంచడంలో విటమిన్ డి పాత్ర ఎంత ప్రధానమని వివరిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే విటమిన్ డి లోపం లేకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంకా ఏయే ఆహార పదార్థాల్ని మెనూలో చేర్చుకోవాలి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అందుకే అవి తీసుకోవాలి!
ఎముకల్ని దృఢంగా ఉంచడంలో విటమిన్ డి ప్రధాన పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు. అలాగే ఈ విటమిన్ తగినంత తీసుకోవడం వల్ల కొన్ని క్యాన్సర్లకు కూడా దూరంగా ఉండచ్చని వివరిస్తున్నారు. ఈ విటమిన్ లోపిస్తే కండరాల బలహీనత, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, ఆందోళన, ఒత్తిడి, అలసట, జుట్టు రాలడం, దీర్ఘకాలిక జీర్ణ సంబంధిత సమస్యలు వంటివి తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. 2019లో The Lancet Diabetes & Endocrinology జర్నల్‌లో ప్రచురితమైన "Vitamin D and Health" అనే అధ్యయనంలోనూ ఈ విషయం వెల్లడైంది. ఈ క్రమంలోనే డి విటమిన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు లేదంటే డాక్టర్ సలహా మేరకు సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇంకా కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటే సహజంగానే పెంచుకోవచ్చని అంటున్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
పాలు, పెరుగు: ఆవు పాలలో విటమిన్ డి అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రోజుకు ఒక గ్లాసు వెన్నతో కూడిన ఆవు పాలు తాగడం వల్ల రోజులో కావాల్సిన మొత్తంలో 20 శాతం దాకా ఈ విటమిన్‌ను శరీరానికి అందించచ్చని వివరిస్తున్నారు. అలాగే ఇందులో ఉండే క్యాల్షియం కూడా ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరమని అంటున్నారు. పెరుగులో కూడా ప్రొటీన్లతో పాటు డి విటమిన్ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అయితే బయట దొరికే పెరుగులో చాలావరకు ఫ్లేవర్స్ కలుపుతుంటారు కాబట్టి అందులో చక్కెర స్థాయులు అధికంగా ఉంటాయని పేర్కొన్నారు. అందుకే ఇంట్లోనే పెరుగు తోడేసుకొని తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
పుట్టగొడుగులు: ఎండలోనే పెరిగే పుట్టగొడుగుల్లో విటమిన్ డి స్థాయులు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు బి1, బి2, బి5, కాపర్ వంటి పోషకాలు కూడా పుట్టగొడుగుల్లో అధికంగా ఉంటాయని వివరిస్తున్నారు. అయితే పుట్టగొడుగుల్లోనూ బటన్ మష్రూమ్స్, స్ట్రా మష్రూమ్స్ ఇలా వివిధ రకాలుంటాయని.. వాటిని బట్టి విటమిన్ డి స్థాయులు మారుతూ ఉంటాయని అంటున్నారు.
పావుగంట ఎండలో!: ముఖ్యంగా సూర్యరశ్మి నుంచి మన శరీరానికి అధిక మొత్తంలో విటమిన్ డి అందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరం క్యాల్షియంను గ్రహించడంలో సహకరిస్తుందని.. తద్వారా ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయని వివరిస్తున్నారు. అలాగే నాడులు, కండరాల ఆరోగ్యానికి కూడా డి విటమిన్ అవసరం ఉంటుందని.. అంతేకాకుండా రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుందని అంటున్నారు. కాబట్టి రోజూ ఉదయాన్నే లేలేత సూర్యకాంతిలో కనీసం పదిహేను నిమిషాలైనా నిలబడమని నిపుణుల సలహా ఇస్తున్నారు.
ఇవి కూడా!
- మలాఫలంలో విటమిన్ సి, డిలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఇవి శరీరంలో ఇమ్యూనిటీని పెంచడానికి దోహదం చేస్తాయని వివరిస్తున్నారు.
- ఓట్స్‌లో విటమిన్ డి అధికంగా లభిస్తుందని నిపుణులు అంటున్నారు. అలాగే ఇందులోని అత్యవసర ఖనిజాలు, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఆరోగ్యానికి, చక్కటి శరీరాకృతికి చాలా అవసరమని వివరిస్తున్నారు.
- గుడ్డులోని పచ్చసొనలో విటమిన్ డితో పాటు ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. అలాగే ఇందులో కొవ్వులు కూడా ఎక్కువగానే ఉంటాయని వివరిస్తున్నారు. అయితే రోజుకు ఒక పచ్చసొన కంటే ఎక్కువ తీసుకోవద్దని సలహా ఇస్తున్నారు. కావాలంటే ఇందులో రుచి కోసం కొన్ని కాయగూర ముక్కల్ని కలుపుకొని ఆమ్లెట్‌లాగా తీసుకోవచ్చని అంటున్నారు.
- చేపల్లోనూ విటమిన్ డి స్థాయులు ఎక్కువే ఉంటాయని నిపుణులు అంటున్నారు. అలాగే ఇందులో ఉండే క్యాల్షియం, ప్రొటీన్లు, ఫాస్ఫరస్ వంటి పోషకాలు సంపూర్ణ ఆరోగ్యానికి సహకరిస్తాయని వివరిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
టైప్ 2 డయాబెటిస్తో భయం ఎందుకు? సింపుల్ టిప్స్‌తో షుగర్ కంట్రోల్ చేయండిలా!
నీరసం, వేడి ఆవిర్లతో ఇబ్బంది పడుతున్నారా? మెనోపాజ్‌లో ఇవి తింటే ఆరోగ్యంగా ఉంటారట!