Menopause Diet Plan: మెనోపాజ్ దశలో మహిళలు శారీరకంగానే కాకుండా మానసికంగానూ అలసిపోతుంటారు. నీరసం, వేడిఆవిర్లు, భావోద్వేగాల్లో మార్పులు, ఒళ్లు నొప్పులు, మతిమరుపు ఇలా అన్నీ కలిసి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. అయితే, వీటి నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని పదార్థాలను తరచూ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపు లేకుండా మన రోజువారీ ఆహారాన్ని ఊహించుకోగలమా? పసుపులో అనేక యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. దీన్ని ఆహారంలో ఎక్కువగా చేర్చుకుంటే వేడిఆవిర్ల నుంచి ఉపశమనం దొరుకుతుందని వివరిస్తున్నారు. ఇంకా గ్రీన్ టీని కూడా తరచూ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇది క్యాన్సర్‌ని దరిచేరకుండా చూడటమే కాకుండా.. శరీరం, మనసు విశ్రాంతి పొందేలానూ చూస్తుందని అంటున్నారు.
సాధారణంగానే ముప్పైల్లో ఎముకల్లో సాంద్రత తగ్గడం ప్రారంభమవుతుంది. అయితే, మోనోపాజ్ సమయంలో ఈస్ట్రోజన్ స్థాయులు తగ్గి ఈ ప్రక్రియ మరింత వేగవంతమవుతుందని నిపుణులు వివరిస్తున్నారు. అందుకే కాల్షియం ఎక్కువగా అందే చీజ్, సోయా, పాలు వంటివి ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే ఆకుకూరలకీ ప్రాధాన్యమివ్వాలని.. తినే ప్లేటులో సగం వీటికే కేటాయించాలని సలహా ఇస్తున్నారు. ఇవీ ఎముక ఆరోగ్యాన్ని రక్షిస్తాయని అంటున్నారు. వీటితోపాటు బ్రాకలి, కాలీఫ్లవర్ వంటివీ తీసుకుంటే వేడిఆవిర్లకు చెక్ పెట్టొచ్చని తెలిపారు. సోయా ఉత్పత్తులూ వీటిని నివారిస్తాయని.. రాత్రుళ్లు చెమట పట్టడం లాంటివి తగ్గిస్తాయని పేర్కొన్నారు. 2020లో Nutrientsలో ప్రచురితమైన "Leafy Green Vegetables and Menopausal Symptoms: A Review of the Current Evidence"లోనూ ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ముఖ్యంగా మెనోపాజ్ దశలో ఐరన్‌నీ నిర్లక్ష్యం చేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది పుష్కలంగా అందే నట్స్, పప్పుధాన్యాలు, గుడ్లు, చికెన్‌ను తమ డైట్‌లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. కానీ, రోజులో కొవ్వు శాతం ఎంత తీసుకుంటున్నారన్న విషయం మాత్రం చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. వైద్యుల సలహాతో అవసరమైతే సప్లిమెంట్లనీ వాడొచ్చని సలహా ఇస్తున్నారు. అయితే ఆరోగ్యకరమైనవి తీసుకుంటే సరిపోదని.. కొన్నింటికి దూరంగానూ ఉండాలని అంటున్నారు. ముఖ్యంగా కారం ఎక్కువగా ఉండే ఆహారం, కెఫీన్‌తోపాటు పిండి పదార్థాలు ఉండే బంగాళదుంప, అన్నం, బ్రెడ్‌లను చాలా పరిమితంగా తీసుకోవాలని చెబుతున్నారు. చక్కెర, ఉప్పులనూ వీలైనంతగా తగ్గించాలని తెలిపారు. మంచినీళ్లను ఎక్కువగా తీసుకుంటూ రోజూ కాసేపు వ్యాయామానికి కేటాయిస్తే ఈ దశను సులువుగానే దాటేయొచ్చని వివరిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
పప్పులు ఎలా తింటున్నారు? నానబెట్టకుండా తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
బ్రేవ్ మంటూ తేన్పులు ఇబ్బందిపెడుతున్నాయా? అసలివి ఎందుకు వస్తాయి? తగ్గించుకోవడం ఎలా?