How Many Steps In One Minute 10000 Steps Walk :ప్రస్తుతం ఆధునిక కాలంలో జీవన శైలి మారింది. చాలా మంది ఉద్యోగం, వ్యాపారం అంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. దీంతో శారీరక వ్యాయామం చేయడం తగ్గింది. అందుకే కనీసం రోజుకు కొంత దూరమైనా నడవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే 'రోజుకు 10 వేల అడుగులు' నడవాలనే ఒక కాన్సెప్ట్ తెరపైకి వచ్చింది. మరి ఆరోగ్యంగా ఉండడానికి నిజంగా 10 వేల అడుగులు సరిపోతాయా? లేదంటే ఎక్కువ నడవాలా? తక్కువ నడవాలా? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారు? వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రోజువారీ నడక అనేది ఆరోగ్యానికి మంచిదే. అయితే రోజుకు వేల అడుగులు నడిస్తేనే ఆరోగ్యానికి మంచిదని అనుకోకూడదు. రోజుకు 10,000 అడుగులు నడుస్తున్నప్పటికీ నిమిషాల వ్యవధిలో మీరు నడిచే స్టెప్ట్పై శ్రద్ధ వహించాలని స్పోర్ట్స్ సైంటిస్ట్, వాక్ యాక్టివ్ వ్యవస్థాపకురాలు జోవన్నా హాల్ తెలిపారు. ఆరోగ్య ప్రయోజనాల కోసం నిమిషానికి 100 అడుగులు నడవాలని సూచిస్తున్నారు. "నిమిషానికి కనీసం 100 అడుగులు నడవాలి. అయితే మినిట్ కు 125-128 అడుగులు నడిస్తే మంచి ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. ఈ గొప్ప మెళకువలతో రోజువారి నడకను వ్యాయామంగా మార్చుకోవచ్చు" అని సూచించారు.
నిమిషానికి 100 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ నడవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్ మెడిసిన్ రీసెర్చ్ ఓ ఆధ్యయనంలో తెలిపింది. అలాగే పెద్దలు వారానికి కనీసం 150 నిమిషాలపాటు వ్యాయామం చేయాలని ఆఫీస్ ఆఫ్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ హెల్త్ పేర్కొంది. ఇలా చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని వెల్లడించింది. వ్యాయామం మానవ హృదయ స్పందన రేటును 50-70 శాతం వరకు పెంచుతుందని కాంకోర్డియా యూనివర్సిటీ ఓ అధ్యయనంలో తేల్చింది. మీ నడక ద్వారా మీరు సమర్థవంతమైన వ్యాయామాన్ని చేస్తున్నారో లేదో హార్ట్ బీట్ రేటు వల్ల తెలుస్తుంది.