Bollywood Ramayan Movie Yash : బాలీవుడ్ లోనే అత్యంత భారీ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మకమైన ఇతిహాస చిత్రం రామాయణ. ఇండియా మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో కనిపించనుండగా సీత పాత్రలో సౌత్ బ్యూటీ సాయి పల్లవి కనిపించనుంది. వీరితో పాటు ఈ సినిమాలో రావణుడిగా యశ్, హనుమంతుడి పాత్రలో సన్నీ దేఓల్ నటించనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చాలా రోజులుగా తిరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం వీరు త్వరలోనే సెట్స్ పైకి కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
నితీశ్ తివారీ దర్శకత్వంలో ముస్తాబవుతున్న రామయణ చిత్ర షూటింగ్ పనులు మార్చి 2024లోనే మొదలు పెట్టినప్పటికీ ముందుగా శ్రీరాముడి పాత్ర పోషిస్తున్న రణబీర్ కపూర్ యాక్టింగ్ భాగాన్ని పూర్తి చేయాలనుకుందట సినిమా టీం. ఇప్పటికే రణబీర్ కపూర్ పాత్రకు సంబంధించి షూటింగ్ దాదాపు 90 శాతం పూర్తయిపోయినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
Ramayan Movie Shooting :మరోవైపు రావణుడి పాత్ర పోషించేందుకుగానూ కన్నడ స్టార్ యశ్ స్క్రీన్ టెస్ట్ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నారనీ, అతి త్వరలో సెట్స్‌లో కూడా కాలు మోపనున్నట్లు తాజాగా ముచ్చటించుకుంటున్నాయి సినీవర్గాలు. 2024 డిసెంబరు నుంచి 2025 మార్చి వరకూ యశ్ రెగ్యులర్ షూటింగులో పాల్గొని, రామాయణ పార్ట్-1లో ఆయన చిత్రీకరణ భాగాన్ని పూర్తి చేయనున్నారట. ఆ తరువాత అంటే 2025 సమ్మర్ నుంచీ హనుమంతుడి పాత్రలో నటించనున్న సన్నీ దేఓల్ షూటింగ్లో పాల్గొనేలా ప్లాన్ చేసిందట రామాయణ టీమ్.
ఇలా విడివిడిగా వీరి షూటింగులను పూర్తి చేసిన తర్వాత రాముడు, రావణుడు, హనుమంతుడు కలిసి కనిపించే సన్నివేశాల కోసం రణబీర్, యశ్, సన్నీదేఓల్ ముగ్గురు కలిసి 2025 సమ్మర్ తర్వాత షూటింగ్ పాల్గొనేలా ముగ్గురి డేట్స్ తీసుకున్నారట డైరెక్టర్ నితీష్. అయితే సినిమాలో సీత పాత్రలో కనిపించనున్న సాయి పల్లవి షూటింగ్‌కు సంబంధించిన సమాచారం మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు.