Golden Globe Awards : పాయల్ కపాడియా దర్శకత్వంలో వచ్చిన ‘ఆల్ వీ ఇమేజిన్ యాజ్ లైట్’ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డుల రేసులో నిరాశే ఎదురైంది. బెస్ట్ నాన్ ఇంగ్లిష్ ఫిల్మ్ కేటగిరీలోని బెస్ట్ మోషన్ పిక్చర్ విభాగంలో ఈ సినిమా పోటీ పడినా, చివరకు ఆ పురస్కారం మాత్రం ఫ్రాన్స్‌కు చెందిన సినిమా ‘ఎమీలియా పెరెజ్’కు దక్కింది.
- ఎమీలియా పెరెజ్ సినిమాలో యాక్ట్ చేసిన నటి జో సల్దానాకు బెస్ట్ సపోర్టింగ్ నటిగా పురస్కారం దక్కింది.
- బెస్ట్ మోషన్ పిక్చర్ కేటగిరీలో పోటీపడిన సినిమాల జాబితాలో ‘ది గర్ల్ విత్ ది నీడిల్’ (పోలండ్), ‘ఐయామ్ స్టిల్ హియర్’ (బ్రెజిల్), ‘ది సీడ్ ఆఫ్ ది సేక్రెడ్ ఫిగ్’ (జర్మనీ), వెర్మిగ్లియో (ఇటలీ) ఉన్నాయి.
పాయల్ కపాడియాకు నిరాశే!
- గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ‘బెస్ట్ డైరెక్షన్’ కేటగిరీలోనూ పాయల్ కపాడియా పేరు నామినేట్ అయింది. అయితే అందులోనూ ఆమెకు భంగపాటే ఎదురైంది.
- ‘ది బ్రూటలిస్ట్’ సినిమాకు డైరెక్టరుగా వ్యవహరించిన బ్రాడీ కార్బెట్‌ను ‘బెస్ట్ డైరెక్షన్’ పురస్కారం వరించింది. ఈ కేటగిరీలో పోటీపడిన దర్శకుల జాబితాలో జాక్వెస్ ఆడియార్డ్ (ఎమీలియా పెరెజ్), సీన్ బేకర్ (అనోరా), ఎడ్వర్డ్ బెర్జర్ (కాంక్లేవ్), కోరాలీ ఫార్గీట్ (ది సబ్ స్టాన్స్) ఉన్నారు.
ఇతర అవార్డులు
- ఫ్రాన్స్ సినిమా ఎమీలియా పెరెజ్‌లోని ‘ఎల్ మాల్’ అనే పాటకు ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. ఆ పాటను పాడిన కెమైల్ డాల్మాయిస్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
- అత్యుత్తమ యానిమేటెడ్ మోషన్ పిక్చర్ పురస్కారాన్ని ‘ఫ్లో’ దక్కించుకుంది. ఇది లాత్వియా దేశ సినిమా. ఈ అవార్డును చిత్ర నిర్మాత జింట్స్ జిల్బాలోదిస్ అందుకున్నారు. ఒక నల్ల పిల్లిని ప్రధాన పాత్రలో చూపిస్తూ నడిచే కథ ‘ఫ్లో’ సినిమాలో ఉంటుంది.
- ఉత్తమ నటుడి అవార్డును అమెరికాకు చెందిన సెబాస్టియన్ స్టాన్ గెల్చుకున్నారు. ‘ఎ డిఫరెంట్ మ్యాన్’ అనే సినిమాలో ఆయన నటించారు.
భారత్ సత్తా చాటిన ‘ఆల్ వీ ఇమేజిన్ యాజ్ లైట్’
ముంబైలో పనిచేసే ఇద్దరు మళయాలీ నర్సులు, వారి స్నేహితురాలు, ఒక వంట మనిషి కేంద్రంగా నడిచే కథే ‘ఆల్ వీ ఇమేజిన్ యాజ్ లైట్’ సినిమాలో ఉంటుంది. 2024 సంవత్సరం మే నెలలో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమాకు గ్రాండ్ ప్రిక్స్ అవార్డు వచ్చింది. ఈ పురస్కారాన్ని పొందిన తొలి భారతీయ సినిమా ఇదే కావడం విశేషం. ప్రఖ్యాత బాఫ్టా పురస్కారాల నామినేటెడ్ జాబితాలోనూ ఈ సినిమాకు చోటు దక్కింది.