Young Farmer Death In jayashankar Bhupalpally Dist : ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడం, దానికి తోడు అప్పుల భారం పెరగడంతో యువరైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జయశంకర్ భూపాలపల్లి చోటుచేసుకుంది. దీంతో మృతుని స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళితే : మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం నందిగామ గ్రామనికి చెందిన నీలాల శేఖర్(29) తండ్రి చిన్నతనంలో చనిపోయాడు. తల్లి, సోదరుడితో కలిసి తమకున్న రెండు ఎకరాల భూమితో పాటు మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవాడు. పంటకోసం తెలిసిన వారందరి వద్దా అప్పులు తీసుకున్నాడు. కానీ పంట గిట్టుబాటు కాకపోవడంతో పాటు మరోవైపు అప్పులు పెరిగిపోవడంతో అతడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
పురుగుల మందు తాగి : ఈ క్రమంలోనే యువరైతు శేఖర్ ఈనెల ఒకటిన పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించగా అక్కడే చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. అతడు చనిపోయే ముందు ఒక లేఖను విడుదల చేశారు. ఈ క్రమంలో తన చావుకు ఎవరూ కారణం కాదని ఆర్థిక ఇబ్బందులే కారణమని లేఖలో యువరైతు నీలాల శేఖర్ పేర్కొన్నారు.
అమ్మను మంచిగా చూసుకో! : తానో సాధారణ వ్యవసాయ రైతునని వ్యవసాయంలో తీవ్ర నష్టం జరిగి పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు భారంతో పాటు పండించిన పంటల్లో సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో జీవితంపై విరక్తి చెంది విషం తాగి చనిపోతున్నట్లుగా లేఖలో పేర్కొన్నాడు. బతుకులు మారతాయని ఎక్కువ మొత్తంలో వ్యవసాయం చేసినప్పటికీ, వాటికి గిట్టుబాటు ధరలు లేవని, పంటకోసం తెచ్చిన అప్పులు ఇవ్వమని అడుగుతున్నారని తన లేఖలో యువరైతు పేర్కొన్నాడు. కుటుంబానికి భారం కాకుడదనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా అందులో వివరించారు. తన అమ్మను మంచిగా చూసుకోవాలని తన సోదరుడిని కోరాడు.