Vishal Health Issue : పందెం కోడి, పొగరు, భరణి, పూజ, అభిమన్యుడు, డిటెక్టివ్, మార్క్ ఆంటోని తదితర సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు హీరో విశాల్. కోలీవుడ్‌లో స్టార్ హీరోగా పేరొందిన విశాల్‌కు తెలుగులోనూ భారీగా అభిమానులు ఉన్నారు. గతేడాది రత్తం (తెలుగులో రత్నం) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు విశాల్. ఆ తర్వాత పెద్దగా బయట కనిపించలేదు. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి గుర్తు పట్టలేనంతగా మారిపోయారు.
వణికిన విశాలు చేతులు
చెన్నైలో ఆదివారం జరిగిన 'మదగజ రాజ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విశాల్ హాజరయ్యారు. అప్పుడు విశాల్ బాగా సన్నగా కనిపించారు. అలాగే ఈవెంట్‌కు తన అసిస్టెంట్ సాయంతో వచ్చారు. విశాల్ మైక్‌లో మాట్లాడుతుండగా ఆయన చేతుల వణికిపోయాయి. దీంతో అక్కడున్న అభిమానుల్లో ఒకింత ఆందోళన మొదలైంది.
అభిమానుల్లో ఆందోళన
అయితే విశాల్ గత కొద్ది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారట. అందుకే ఆయన చేతులు వణికినట్లు తెలుస్తోంది. అయితే విశాల్ ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళనగా ఉన్నారు. తమ అభిమాన హీరోకి ఏమైందని భయపడుతున్నారు. తమ అభిమాని హీరో త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
త్వరగా కోలుకోవాలని పోస్టులు
విశాల్‌ను ఇలా చూడడం బాధగా ఉందని, ఆయన త్వరగా కోలుకోవాలని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అలాగే జ్వరంతో బాధపడుతున్నప్పటికీ సినిమా ప్రమోషన్లో పాల్గొనడం చాలా గొప్ప విషయమని మరికొందరు ప్రశంసిస్తున్నారు. మురుగన్ ఆశీస్సులతో విశాల్ త్వరగా కోలుకోవాలని మరో అభిమాని ఆకాంక్షించారు.
సంక్రాంతి విశాల్ మూవీ రిలీజ్
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ లీడ్ రోల్లో నటించిన చిత్రం 'మదగజ రాజ'. ఈ సినిమా 12ఏళ్ల కిందటే ప్రారంభమై 2013లో షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే పలు కారణాల వల్ల ఇది రిలీజ్‌కు నోచుకోలేదు. ఎట్టకేలకు ఈ సినిమా థియేటర్లలో అలరించేందుకు సిద్ధమైంది. 2025 సంక్రాంతి బరిలో నిలిచింది. ఈ సినిమా జనవరి 12న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. డైరెక్టర్ సుందర్ సి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కామెడీ, ఫ్యామిలీ డ్రామా జానర్ లో ఈ చిత్రం రూపొందింది. అంజలి, వరలక్ష్మీ శరత్ కుమార్, సంతానం కీలక పాత్రలు పోషించారు. విజయ్ అంటోనీ సంగీతం అందించారు.