ACTOR ALLEGATIONS ON PRODUCTION HOUSES : అగ్ర నిర్మాణ సంస్థలతో సినిమా అంటే భారీగా పారితోషికం, మంచి ఫేమ్ వస్తుందనే భావన చాలా మంది నటుల్లో ఉంటుంది. అయితే తాజాగా ఓ ప్రముఖ నటుడు మాత్రం ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన రెండు బడా ప్రొడక్షన్ హౌస్‌లపై కీలక ఆరోపణలు చేశారు. దీంతో ప్రస్తుతం ఆ కామెంట్స్ వైరల్‌గా మారి చర్చకు దారీ తీశాయి.
ఆ నిర్మాణ సంస్థలు ఏవంటే? - బాలీవుడ్లో కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్, ఆదిత్య చోప్రా యశ్ రాజ్ ఫిల్మ్స్ బడా నిర్మాణ సంస్థలుగా మంచి పేరుంది. ఈ బ్యానర్లపై పలు భారీ బడ్జెట్ చిత్రాలు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా ఈ రెండు నిర్మాణ సంస్థలను ఉద్దేశించి బాలీవుడ్ యాక్టర్ విక్రమ్ కపాడియా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ బాడా ప్రొడక్షన్ హౌస్‌లు, ఎంత కష్టపడినా నటీ నటులకు తక్కువ రెమ్యునరేషన్ చెల్లిస్తాయని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కాగా, కపూర్ అండ్ సన్స్, యోధ, ది నైట్ మేనేజర్, మేడ్ ఇన్ హెవెన్, స్కామ్ 1992 వంటి హిట్ ప్రాజెక్టుల్లో నటించారు విక్రమ్ కపాడియా.
"యశ్ రాజ్ ఫిల్మ్స్, ధర్మా ప్రొడక్షన్స్‌కు అహంకారం ఎక్కువ. వారు నటీ నటులకు తక్కువ పారితోషికం అందిస్తారు. ఆ సంస్థలు, మేము అగ్ర నిర్మాణ సంస్థలం. మీకు తక్కువగా డబ్బులు ఇస్తాం. అయినా కూడా మీరు సంతోషంగానే ఉండాలి. అనే భావనతో ఉంటారు. కేవలం కొందరు యాక్టర్స్తోనే కాదు, అందరితోనూ వారు అలానే ప్రవర్తిస్తారు." అని విక్రమ్ కపాడియా చెప్పుకొచ్చారు.