Two Women Married : తాగుబోతు భర్తల వేధింపులతో విసిగిపోయిన ఇద్దరు మహిళలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. భర్తలు పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక వారి నుంచి విడిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌లో జరిగింది.
అసలేం జరిగిందంటే?
గోరఖ్‌పుర్‌కు చెందిన ఇద్దరు మహిళలు తమ కుటుంబాలను వదిలిపెట్టి ఒకరినొకరు పెళ్లి చేసుకున్నారు. గురువారం సాయంత్రం దియోరియాలోని శివాలయంలో కవిత, గుంజా అలియాస్ బబ్లూ వివాహం చేసుకున్నారు. తమ భర్తల మద్యపాన అలవాట్లు, వేధింపుల కారణంగా విసిగిపోయిన ఇద్దరు మహిళలు మొదట ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యారు. ఆ తర్వాత స్నేహితులుగా మారారు. ఇద్దరూ తమ భర్తల చేతిలో గృహ హింసకు గురయ్యారు. దీంతో, భర్తలను విడిచివెళ్లాలని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆలయంలో గుంజా వరుడిగా మారి కవిత నుదుటి తిలకం దిద్దారు. దండలు మార్చుకుని, ఏడు అడుగులు నడిచారు.
"మా భర్తల మద్యపానం అలవాటు, దుష్ప్రవర్తనతో మేమిద్దరం హింసకు గురయ్యాం. ప్రేమ, శాంతితో కూడిన జీవితాన్ని గడపడానికి పెళ్లి చేసుకున్నాం. మేము గోరఖ్‌పుర్‌లో జంటగా నివసించాలనుకుంటున్నాం. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరికొకరం పరిచయమయ్యాం. ఇద్దరి సారూప్య పరిస్థితుల వల్ల పరస్పరం దగ్గరయ్యాం. గోరఖ్‌పుర్‌లో ఇంటిని అద్దెకు తీసుకుని జీవిత ప్రయాణాన్ని సాగిస్తాం" అని గుంజా తెలిపింది. కాగా, ఇద్దరు మహిళల పెళ్లిపై శివాలయం పూజారి స్పందించారు. మహిళలు పూల దండలు, సిందూరం తెచ్చి ఆలయంలో పూజలు చేసి వెళ్లిపోయారని ఆలయ పుజారి శంకర్ పాండే తెలిపారు.
స్వలింగ సంపర్క వివాహాలకు సుప్రీం నో
2023లో స్వలింగ సంపర్కుల వివాహాలకు ప్రత్యేక వివాహాల చట్టం కింద చట్టబద్ధత కల్పించేందుకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా నిరాకరించింది. అలాంటిది చేయాలంటే దానికి తగ్గట్టు చట్టాన్ని మార్చే పరిధి పార్లమెంటుకు మాత్రమే ఉందని స్పష్టం చేసింది. కోర్టులు చట్టాలను రూపొందించబోవని తెలిపింది. అయితే స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత లేకపోయినప్పటికీ పలు రాష్ట్రాల్లో వారు వివాహాలు చేసుకుంటున్నారు. స్వలింగ, లెస్బియన్ జంటలు వివాహం చేసుకున్న ఘటనలు ఇటీవల కాలంలో చాలా వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది జనవరి 10న బిహార్‌లోని బెగుసరాయ్‌కు చెందిన ఒక లెస్బియన్ జంట దిల్లీకి పారిపోయి ఒక ఆలయంలో వివాహం చేసుకున్నారు.