తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఫ్యాన్స్​కు దళపతి 'డబుల్' ట్రీట్ - 'ది గోట్' ఎలా ఉందంటే? - Vijay The Goat Movie Telugu Review - VIJAY THE GOAT MOVIE TELUGU REVIEW

Vijay The Goat Movie Telugu Review: విజయ్‌ కథానాయకుడిగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో రూపొందిన 'ది  గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్' ఎలా ఉందంటే?

The Goat Telugu Review
The Goat Telugu Review (Source: ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 5, 2024, 2:21 PM IST

Vijay The Goat Movie Telugu Review:త‌మిళ నటుడు విజ‌య్ లీడ్ రోల్​లో తాజాగా విడుదలైన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్'. వెంక‌ట్ ప్ర‌భు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉందంటే?

స్టోరీ ఏంటంటే:స్పెష‌ల్ యాంటీ టెర్ర‌రిస్ట్ స్వ్కాడ్ టీమ్​లో ఏజెంట్‌గా ప‌ని చేస్తుంటాడు గాంధీ (విజ‌య్). అయితే, త‌న ఉద్యోగం గురించి భార్య అను (స్నేహ‌) దగ్గర రహస్యంగా ఉంచుతాడు. అంతలోనే ఓ మిష‌న్ కోసం గాంధీ థాయ్‌లాండ్‌కు వెళ్లాల్సి వ‌స్తుంది. అయితే అక్క‌డికి వెళ్లాక ఆ మిష‌న్ వ‌ల్ల గాంధీ ఫ్యామిలీకి ముప్పు ఎదుర‌వుతుంది. ఈ క్ర‌మంలోనే త‌న ఐదేళ్ల కొడుకు జీవ‌న్‌ను అతడు కోల్పోతాడు. ఆ ఘ‌ట‌న వల్ల గాంధీ తీవ్రంగా కుంగిపోతాడు.

త‌న వ‌ల్లే కొడుకును కోల్పోవాల్సి వ‌చ్చింద‌న్న బాధ‌తో తన ఉద్యోగాన్ని వ‌దిలేస్తాడు. క్రమంగా భార్య కూడా అత‌డ్ని దూరం పెడుతుంది. అలా ఈ ఇద్దరి మధ్య దూరం ఏర్పడి 15 ఏళ్లు గ‌డిచిపోతాయి. అయితే ఓసారి ఓ ప‌ని విష‌య‌మై మాస్కోకి వెళ్లిన గాంధీకి అనూహ్యంగా త‌న కొడుకు జీవ‌న్ (విజ‌య్‌) క‌నిపిస్తాడు. ఓ రౌడీ గ్యాంగ్​ ఉచ్చులో చిక్కుకొని ఉన్న త‌న బిడ్డ‌ను కాపాడి భార‌త్‌కు తీసుకొస్తాడు. కొడుకు రాక‌తో గాంధీ కుటుంబం మ‌ళ్లీ క‌లుస్తుంది. ఇక అంతా బాగుంద‌నుకున్న టైమ్‌లో గాంధీ స్క్వాడ్ టీమ్ బాస్ న‌జీర్ (జ‌య‌రామ్‌)ను ఎవ‌రో చంపేస్తారు. ఆ త‌ర్వాత ఆ టీమ్‌లోని ఒక్కొక్కరూ వ‌రుస‌గా హ‌త్య‌కు గుర‌వుతుంటారు. మ‌రి ఈ హ‌త్య‌ల‌కు కార‌ణ‌మెవ‌రు? జీవ‌న్‌కు ఈ హ‌త్య‌ల‌కూ ఉన్న లింకేంటి? త‌ను తండ్రిని చంపాల‌ని ఎందుకు ప‌గ‌బ‌డ‌తాడు? జీవ‌న్‌ను పెంచి పెద్ద చేసిన మేన‌న్ (మోహ‌న్‌)కు గాంధీకీ ఉన్న విరోధం ఏంటి? అన్న‌ది మిగ‌తా క‌థ‌.

ఎలా సాగిందంటే: ఓ ఏజెంట్ దేశ ర‌క్ష‌ణ కోసం ఎంత‌కైనా తెగించే క‌థ ఇది. అనుకోని ప‌రిస్థితుల్లో అత‌డు ఓ మిష‌న్‌లో త‌న కొడుకును కోల్పోవ‌ల‌సి వస్తుంది. అయితే 15ఏళ్ల త‌ర్వాత ఆ కొడుకే త‌న పాలిట య‌ముడిలా మారి, దేశానికి పెద్ద స‌మ‌స్య‌లా మారతాడు. ఈ క్ర‌మంలో అత‌డి ఆట క‌ట్టించేందుకు ఆ తండ్రి ఏం చేశాడ‌న్న‌దే ఈ సినిమా క‌థాంశం.

అయితే సినిమా కథలో పెద్ద‌గా కొత్త‌ద‌న‌మేమీ లేదు. కానీ, స్క్రీన్​ప్లే స్పెష‌లిస్ట్ వెంక‌ట్ ప్ర‌భు తెర‌కెక్కించిన సినిమా కావ‌డం వల్ల దీంట్లో ఓ మ్యాజిక్ ఉంటుంద‌న్న‌ భ‌రోసా ప్రేక్ష‌కుల్లో క‌నిపిస్తుంది. అయితే ఏజెంట్ సినిమాల్లో క‌నిపించే ట్విస్ట్‌లు, మ‌లుపులు, మెరుపులు ఏ ఒక్క‌టి ఈ సినిమాలో కనిపించలేదు. క‌నీసం హీరో చేసే ఆప‌రేష‌న్స్‌లోనూ థ్రిల్ లేదు. పైగా విరామం వ‌ర‌కు స్టోరీ లాగింగ్​గా ఉంటుంది. హీరోకి త‌న త‌న‌యుడు కనిపించినప్పుటడి నుంచే క‌థ వేగం పుంజుకుంటుంది. ఈ క్ర‌మంలో కొడుకుని కాపాడు కోవ‌డం కోసం మాస్కోలోని విల‌న్ గ్యాంగ్‌తో గాంధీ చేసే ఛేజింగ్ యాక్ష‌న్ సీక్వెన్స్ అల‌రిస్తుంది.

విరామానికి ముందు జీవ‌న్ పాత్రతో ద‌ర్శ‌కుడు ఇచ్చిన ట్విస్ట్ ఆస‌క్తిరేకెత్తిస్తుంది. అంతకంటే ముందు తండ్రీకొడుకులు మ‌ధ్య మెట్రోలో జ‌రిగే యాక్ష‌న్ సీక్వెన్స్ హైలైట్‌. విరామానికి ముందే జీవ‌న్ విల‌న్ అని రివీలైపోవ‌డం వల్ల, సెకండ్ హాఫ్​లో తండ్రీకొడుకుల మ‌ధ్య పోరు ఎలా ఉండ‌నుందా? అన్న ఆస‌క్తి ప్రేక్ష‌కుల్లో మొద‌లైపోతుంది. దానికి త‌గ్గ‌ట్లుగానే సెకండ్ హాఫ్​ ఆరంభంలో గాంధీ- జీవ‌న్‌కు మధ్య నడిచే మైండ్ గేమ్ కాసేపు ఆస‌క్తిరేకెత్తిస్తుంది. అయితే, తండ్రిపై ప‌గ పెంచుకోవ‌డానికి జీవ‌న్‌కు ఉన్న‌ కార‌ణాన్ని ఎఫెక్టివ్‌గా చూపించలేదు. ఇక మ‌ధ్య‌లో మీనాక్షితో త‌న ల‌వ్‌ట్రాక్‌ అన‌వ‌స‌రంగా వ‌చ్చి ప‌డిపోయే పాట‌లు, యోగిబాబు కామెడీ ట్రాక్ అన్నీ బోరింగ్. క్లైమాక్స్‌లో వ‌చ్చే యాక్ష‌న్ సీక్వెన్స్‌ దానితో ముడిప‌డి సాగే ఐపీఎల్ ట్రాక్ ప్రేక్ష‌కుల్లో కాస్త జోష్‌ను నింపుతాయి.

ఎవ‌రెలా చేశారంటే:ఈ సినిమాతో విజయ్ హీరోయిజంతోపాటు విల‌నిజాన్ని కూడా రుచి చూపించారు. తండ్రీకొడుకులుగా విజ‌య్ ద్విపాత్రాభిన‌యం ఆక‌ట్టుకుంటుంది. ఆయ‌న నుంచి అభిమానులు కోరుకునే మాస్ మేనరిజమ్స్, పంచ్ డైలాగ్స్, యాక్ష‌న్ సీక్వెన్స్ కొన్నిందులో క‌నిపిస్తాయి. ముఖ్యంగా ఆరంభంలో ఆయ‌న కెప్టెన్ విజ‌య్‌కాంత్ లుక్‌లో ఎంట్రీ ఇచ్చిన తీరు ప్రేక్ష‌కుల్ని బాగా అల‌రిస్తుంది. అయితే విజ‌య్ యంగ్ లుక్ కోసం ద‌ర్శ‌కుడు వాడిన టెక్నాల‌జీ కొన్ని చోట్ల తేడా కొట్టింది.

స్క్వాడ్ ఏజెంట్స్‌గా జ‌య‌రామ్‌, ప్ర‌భుదేవా, ప్ర‌శాంత్‌, అజ్మ‌ల్ పాత్ర‌లు ప‌రిధి మేర‌కు ఉన్నాయి. మీనాక్షి ద్వితీయార్ధంలో రెండు సీన్లు, ఓ పాట‌కు ప‌రిమిత‌మైపోయింది. ప‌తాక ఘ‌ట్టాల్లో శివ కార్తికేయ‌న్ అతిథి పాత్ర‌లో త‌ళుక్కున మెరిశారు. ‘ది గోట్‌ మూవీ’ ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు క‌థ‌లో కొత్త‌ద‌నం లేదు. ద్వితీయార్ధం బాగున్నా, ఓ బలమైన పాయింట్‌ ముగించాల్సింది. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం ఏమాత్రం ప్ర‌భావం చూపించ‌లేక‌పోయింది. సాంకేతికంగా సినిమా ఓకే.

బ‌లాలు

  • + విజ‌య్ న‌ట‌న‌. విల‌నిజం
  • + పోరాట ఘ‌ట్టాలు
  • + విరామ స‌న్నివేశాలు

బ‌ల‌హీన‌త‌లు

  • - కొత్త‌ద‌నం లేని క‌థ
  • -ఊహ‌ల‌కు త‌గ్గ‌ట్లుగా సాగే క‌థ‌నం
  • -ప్ర‌థమార్ధం

చివ‌రిగా : పేరుకే గ్రేటెస్ట్‌. క‌థ ప‌రంగా కాదు!
గమనిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ABOUT THE AUTHOR

...view details