SSMB 29 Budget :సూపర్ స్టార్ మహేశ్ బాబు- దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న ప్రాజెక్ట్ 'SSMB 29'. ఈ సినిమా కోసం యావత్ దేశమంతా ఎదురుచూస్తోంది. ఇటీవల రాజమౌళి ఆఫ్రికా ట్రిప్ నుంచి పలు ఫొటోలు షేర్ చేసి, సినిమాపై హైప్ పెంచేశాడు. అలా సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా అది క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. అయితే టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ గురించి మాట్లాడారు. ఆ కామెంట్స్ కాస్త ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
'మహేశ్- రాజమౌళి ప్రాజెక్ట్ బడ్జెట్ కచ్చితంగా రూ.1000 కోట్లు దాటొచ్చని అంచనా. ఇందులో హాలీవుడ్ ఆర్టిస్టులు నటించనున్నారు. అలాగే దీని బిజినెస్ కనీసం రూ.2000కోట్లు దాటొచ్చని టీమ్ భావిస్తోంది. ఇక అంతకుమించి ఎంతైనా వసూలు చేయొచ్చు. వసూళ్లు రూ.3, 4 వేల కోట్ల వరకు వెళ్లొచ్చు. ఒకవేళ అదే జరిగితే తెలుగు సినిమాలోనే కాదు, భారతదేశ సినీరంగంలోనే రికార్డు అవుతుంది. ఈ ప్రాజెక్ట్ బిజినెస్ ఊహించడం కూడా కష్టం. భవిష్యత్‌ను రాజమౌళి బాగా ఊహిస్తారు. ఆయన ఈ చిత్రంతో మళ్లీ మరోసారి సత్తా చాటనున్నారు'
'తెలుగు సినిమా రేంజ్ బాహుబలి తర్వాత బాగా పెరిగింది. రూ.100 కోట్ల సినిమా అంటే సాధారణ విషయంలా ఉంది. 'ఆర్‌ఆర్ఆర్' తర్వాత రూ.300 కోట్లు చిన్న బడ్జెట్ అయిపోయింది. ఇప్పుడు మహేశ్ సినిమా వచ్చాక రూ.500 కోట్లు కూడా సాధారణ విషయంలానే అనిపిస్తుంది. తెలుగు సినిమా ఎవరూ ఊహించని స్థాయికి ఎదుగుతుంది. రాజమౌళి తన విజన్‌తో ఇండస్ట్రీ స్థితిగతులనే మార్చేశారు. 'SSMB 29'తో ఇండస్ట్రీ మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా. ఈ ప్రాజెక్ట్ తర్వాత ప్రపంచమంతా తెలుగు సినిమా గురించే మాట్లాడుకుంటుంది' అని ఆయన అన్నారు.