Pattudala Telugu Review : తమిళ స్టార్ హీరో అజిత్ లీడ్ రోల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'పట్టుదల'. సంక్రాంతి కానుకగా విడుదలవ్వాల్సిన ఈ చిత్రం కాస్త లేట్‌గా శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. తమిళంలో 'విడాముయర్చి'గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో 'పట్టుదల' అనే పేరుతో రిలీజైంది. మరీ ఈ చిత్రం ఎలా ఉందంటే?
స్టోరీ ఏంటంటే :
అజర్బైజాన్లో సాగే కథ ఇది. అక్కడి బాకు నగరంలో ఓ అమెరికన్ కంపెనీలో ఆఫీసర్‌గా పనిచేస్తుంటారు అర్జున్ (అజిత్‌కుమార్). ఆయన భార్య కాయల్ (త్రిష). ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరూ పన్నెండేళ్ల పాటు అన్యోన్యంగా జీవిస్తారు. అయితే ఆ తర్వాత ఆ ఇద్దరి వైవాహిక బంధానికి బీటలు వారుతుంది. దీంతో అర్జున్ నుంచి విడిపోవాలనే నిర్ణయానికొస్తుంది కాయల్.
అయితే తన పుట్టింటికి వెళ్లలనుకుంటున్న కాయల్ను తానే కార్‌లో దిగబెడతానంటూ వస్తారు అర్జున్. ఇద్దరికీ గుర్తుండిపోయేలా ఆఖరి ప్రయాణంలా ఇది ఉంటుందని ఆయన అంటారు. దీంతో కాయల్ కూడా ఈ ప్రయాణానికి అంగీకరిస్తుంది. అయితే వారి జర్నీలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఆ తర్వాత కాయల్ కనిపించకుండా పోతుంది.
ఇంతకీ కాయల్కు ఏమైంది? ఆమెను వెదుక్కుంటూ వెళ్లిన అర్జున్‌కు ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? దారి మధ్యలో తెలుగువాళ్లుగా పరిచయమైన రక్షిత్ (అర్జున్), దీపిక (రెజీనా)కి - అర్జున్, కాయల్‌కీ ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే :
పాత్రల ప్రయాణంతో ముడిపడిన ఎన్నో కథలు మనం చూసుంటాం. హాలీవుడ్‌లోనూ రోడ్ ట్రిప్ థ్రిల్లర్స్‌గా పలు సినిమాలు వచ్చాయి. వాటిని గుర్తు చేసేలా ఉంటుంది ఈ చిత్రం. అజిత్ స్టైల్ మాస్ ఎలిమెంట్స్ ఉంటుందనుకుని వెళ్తే మాత్రం అభిమానులకు నిరాశ తప్పదు. కానీ ఇది స్టైలిష్‌గా, ఆయన గత చిత్రాలకు భిన్నంగా ఓ కొత్త నేపథ్యాన్ని ఆవిష్కరించింది.
ఓ కొత్త రకమైన కాన్సెప్ట్‌లో అజిత్‌ని చూడటానికి ఇష్టపడే ఆడియెన్స్‌ను ఈ సినిమా చాలావరకూ మెప్పిస్తుంది. కానీ ఇందులో స్టోరీ మాత్రం సాధారణంగానే సాగుతుంది. భార్య జాడ కోసం భర్త అన్వేషణ. ఆ ప్రయాణంలోని ట్విస్ట్లే ఈ సినిమాకి ప్రధానబలం. అయితే కథలో ట్విస్ట్‌లు ఉన్నా కానీ డైరెక్టర్ వాటిని ఎగ్జైట్మెంట్ కలిపించేలా తెరపై ఆవిష్కరించడంలో విఫలమయ్యారు డైరెక్టర్.
పాటతో హుషారుగా సినిమా ప్రారంభమైనప్పటికీ, ఫస్ట్ హాఫ్ మొత్తం స్లోగా సాగుతుంది. హీరో హీరోయిన్లు లవ్‌లో పడటం, ఆ తర్వాత విడిపోవాలనుకోవడం, రోడ్ ట్రిప్ మొదలు పెట్టడం ఇదే ఫస్ట్ హాఫ్ స్టోరీ. అయితే ఈ సీన్స్ అన్నింటిలో వేగం కానీ, కొత్తదనం కానీ ఉండదు. అంతేకాకుండా విలన్లు ఏం చేసినా, హీరో నుంచి ఏ మాత్రం ప్రతిఘటన ఉండదు. అజిత్ లాంటి ఓ మాస్ హీరోని తెరపై అలా చూపించటం ఆయన అభిమానులకు మింగుడుపడని విషయం.
రియలిస్టిక్‌గా కథని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఆ పాత్రని అలా చూపించారని సరిపెట్టుకోవాలి. విరామ సన్నివేశాల నుంచే అసలు కథ మొదలవుతుంది. అనూహ్యమైన మలుపులు థ్రిల్‌ని పంచుతాయి. విరామం తర్వాత వచ్చే కార్ సీక్వెన్స్ ఫైట్ నుంచి కథనం పరుగులు పెడుతుంది. అయితే రక్షిత్, దీపికల నేపథ్యాన్ని, వాళ్లెవరనే విషయాల్ని హీరో అడగ్గానే రివీల్ చేయడం వల్ల ఆడియెన్స్‌కు థ్రిల్ మిస్ అవుతుంది.
ఇక ఆ తర్వాత సీన్స్ అన్నీ నార్మల్‌గానే సాగుతాయి. అయితే ఆ పాత్రలు అలా మారడానికి గల కారణాలేమిటనే విషయాలను లోతుగా చూపించలేకపోయారు మేకర్స్. పతాక సన్నివేశాలు ఊహకు తగ్గట్టుగానే సాగుతాయి. లవ్ యాంగిల్, విడిపోవాలనుకున్న భార్యాభర్తల బంధం నేపథ్యంలో వచ్చే ఎమోషనల్ సీన్స్‌ను చూపించడంలో విఫలమయ్యారు డైరెక్టర్.
ఎవరెలా చేశారంటే :
అజిత్, త్రిష జోడీ స్క్రీన్‌పై ఆకట్టుకుంటుంది. ఇందులో అజిత్ రెండు కోణాల్లో తెరపై కనిపిస్తారు. సెకెండాఫ్‌లో తనలోని యాక్షన్ కోణాన్ని బయటకు తీస్తారు. అయితే యాక్షన్ సీన్స్‌ను కూడా చాలా రియలిస్టిక్‌గా ఉండేలా డిజైన్ చేశారు. అందుకే అవి ఈ మూవీపై పెద్ద ఎఫెక్ట్ చూపించలేదు.
ఫస్ట్‌హాఫ్‌లోనే త్రిష ఎక్కువగా కనిపిస్తుంది. రెజీనా, అర్జున్ రోల్స్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ఓ డిజార్డర్‌తో బాధపడుతున్న యువతిగా రెజీనా కనిపించిన తీరు, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆమె నటన చాలా బాగుంటుంది. అయితే ఆ రోల్స్‌ను ఇంకా బలంగా వాడుకోలేకపోయారు డైరెక్టర్. అర్జున్ చేసిన యాక్షన్ కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుంది. ఆయన పాత్రను మరింత డెప్త్‌గా చూపించాల్సింది. ఇక ఈ సినిమాలోని మిగిలిన పాత్రలకి అంతగా ప్రాధాన్యం లేదు.
సాంకేతిక విభాగాల్లో ఓం ప్రకాశ్ సినిమాటోగ్రఫీ సినిమాకి బలంగా నిలిచింది. నిర్మానుష్యంగా కనిపించిన అజర్ బైజాన్ రహదారులను చూపించిన తీరు, ఆ ఫ్రేమ్స్‌తోనే ఓ స్పెషల్ ఫీలింగ్‌ను కలిగించిన వైనం ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుంది. ప్రారంభంలో వచ్చే పాటతోనూ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తోనూ అనిరుధ్ ప్రేక్షకులను అలరించారు. డైరెక్టర్ మగిజ్ తిరుమేని ఇప్పటి తరం ప్రేక్షకుల అభిరుచులకి తగ్గట్టుగా ఈ సినిమా పాత్రల్ని, సీన్స్‌ను స్టైలిష్‌గా డిజైన్ చేశాడు. అయితే కథనం పరంగానే ఆయన సరిగ్గా ఫోకస్ చేయలేకపోయారు. నిర్మాణ విలువలు బాగుంది.
- బలాలు
- + కథా నేపథ్యం, మలుపులు
- + అజిత్, త్రిష జోడీ
- బలహీనతలు
- - భావోద్వేగాలు పండకపోవడం
- - ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్, కథనం
- చివరిగా : భార్య కోసం 'పట్టుదల'గా.
- గమనిక : ఈ సమీక్ష కేవలం సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!