ICC Champions Trophy 2025 Australia Squad : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా జట్టుకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి రెండు వారాల మాత్రమే ఉన్నందున అందరిలోనూ టెన్షన్ మొదలైంది. ఇప్పటికే గాయాల కారణంగా మిచెల్ మార్ష్ లాంటి స్టార్ ప్లేయర్లు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్నారు. తాజాగా ఆ జట్టు సారథి ప్యాట్ కమిన్స్ కూడా ఈ సారి గేమ్‌కు దూరమయ్యాడు. తనతో పాటు ఫాస్ట్ బౌలర్ జోష్ హెజీల్‌వుడ్ కూడా ఈ సారి అందుబాటులో ఉండడని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ జార్జ్ బైలీ గురువారం అధికారికంగా ప్రకటించారు.
"ఇది ఓ బాధాకర పరిణామం. అయినప్పటికీ మిగతా ప్లేయర్లకు గొప్ప అవకాశం లాంటిది. ఇంటర్నేషనల్ టోర్నమెంట్లలో తమ ట్యాలెంట్‌ను నిరూపించుకునే సమయం" అని బైలీ తెలిపారు.
మరోవైపు ఇప్పటికే ఆసీస్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టాయినిస్ వన్డేలకు రిటైర్మెంట్ పలికి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉండడని వెల్లడించాడు. అయితే ఆసీస్ ప్రకటించిన జట్టులో తాను ఓ మెంబర్‌గా ఉన్నప్పటికీ, స్టాయినిస్ గురించి బైలీ ఇప్పటివరకూ ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా గత నెల జట్టును ప్రకటించింది. అందులో ఈ నలుగురు ఆటగాళ్ల పేర్లను ప్రకటించింది. ఇందులో కమిన్స్, హేజెల్‌వుడ్, మార్ష్ ఇప్పటికే గాయాలతో బాధపడుతున్నారు. ఇప్పట్లో వీరంతా కోలుకునే అవకాశం లేదని వెల్లడించారు. దీంతో ఈ టోర్నీకి దూరం కానున్నట్లు పేర్కొన్నారు.
తాజాగా జరిగిన ఈ అనౌన్స్మెంట్ వల్ల ఆసీస్ తమ జట్టులో నాలుగు మార్పులు చేయాల్సిన అవసరం వచ్చింది. అయితే దీనిపై ఫిబ్రవరి 12 లోపు తుది నిర్ణయం తీసుకోవాల్సినట్లు తెలుస్తోంది. ఇక కమిన్స్ స్థానంలో ఎవరిని కెప్టెన్‌గా నియమిస్తారన్న విషయం కూడా ఆసక్తికరంగా మారింది.
2025 ఛాంపియన్స్ ట్రోఫీ పోరుకు మరికొద్ది రోజుల్లో తెరలేవనుంది. ఇప్పటికే వేదికలు, షెడ్యూల్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB), ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రకటించాయి. ఇప్పుడు ప్రారంభ వేడుకలకు సిద్ధమవుతున్నాయి. ఫిబ్రవరి 16న లాహోర్ ఫోర్ట్‌కు సమీపంలోని చారిత్రక ప్రదేశం హుజూరీ బాగ్‌లో ఆ వేడుకలు జరుగుతాయని తెలిపాయి. వివిధ క్రికెట్ బోర్డులకు చెందిన అధికారులు, సెలబ్రిటీలు, దిగ్గజ క్రికెటర్లు, ప్రభుత్వ ప్రతినిధులు సహా పలువురు ముఖ్యమైన అతిథులను వేడుకకు ఆహ్వానించనున్నారు.
'రోహిత్ విరాటే కాదు ఆ ఇద్దరూ స్టార్సే! - ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆడగలరు'
రిటైర్‌మెంట్‌పై ప్లాన్స్‌లో రోహిత్! ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డే, టెస్టులకు బైబై!