Shyam Benegal Passed Away :భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టి సత్తా చాటిన హైదరాబాదీ, సమాంతర చిత్రాలతో ఎన్నో కథలు, పాత్రలకు సజీవ రూపాన్నిచ్చిన సినీ మాంత్రికుడు శ్యామ్ బెనెగల్(90) కన్నుమూశారు. ప్రకటనలు, డాక్యుమెంటరీలతో కెరీర్ ప్రారంభించిన ఆయన, క్లాసిక్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు పొందారు. ధారావాహికలపైనా తనదైన ముద్ర వేశారు. ఆయన గురించి పలు విశేషాలు మీకోసం.
పన్నెండో ఏటే డాక్యుమెంటరీ తీసి
6 ఏళ్ల వయసులోనే దర్శకుడు కావాలని నిర్ణయించుకున్న శ్యామ్ బెనెగల్, తన 12వ ఏటే తండ్రి కెమెరాతో తన కుటుంబం నేపథ్యంలో ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. చదువుకునే వయసులోనే కెమెరాతో ప్రయోగాలు చేస్తూ, వారానికి మూడు సినిమాలు చూస్తూ దర్శకత్వం కలలు కన్నారు. అలా కళాశాలలో స్నేహితులతో కలిసి ఫిలిం సొసైటీని స్థాపించారు. ఎంఏ పూర్తి చేశాక ముంబయి వెళ్లిన ఆయన, ఎవరి దగ్గర సహాయ దర్శకుడిగా జాయిన్ అవ్వలేదు. ఓ ప్రకటనల ఏజెన్సీలో ఇంగ్లిష్ కాపీ రైటర్‌గా చేరి, ఆ తర్వాత వాణిజ్య ప్రచార రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. కొన్ని వందల ప్రచార చిత్రాల్ని తెరకెక్కించారు.
తొలి ప్రయత్నం 'అంకుర్' (Shyam Benegal First Documentary)
వాణిజ్య ప్రకటనలు చేస్తూనే, అంధకారంలో అలమటిస్తున్న అభాగ్య బాల కార్మికుల దైన్యస్థితి నేపథ్యంలో 'ఏ ఛైల్డ్ ఆఫ్ ది స్ట్రీట్' డాక్యుమెంటరీని తీసి అందరి ప్రశంసలను అందుకున్నారు. ఆయన కెరీర్‌కు ఇదొక మలుపు. ఆ తర్వాత అంకుర్ స్క్రిప్ట్ తయారు చేసి తెరకెక్కించారు. అనుకొన్నది అనుకొన్నట్లుగా తీయడానికి ఆయనకు పదమూడు సంవత్సరాలు పట్టింది. 1974లో అంకుర్ విడుదలైంది. కొత్తతరం సినిమాగా ప్రేక్షకులకు చేరువైంది. ఆర్థిక విజయంతోపాటు, జాతీయ, అంతర్జాతీయ పురస్కారాల్ని కైవసం చేసుకుంది. (Shyam Benegal Awards).
పాత్ర కనిపించాలి
తన ఊహల్లోని పాత్రలకు అచ్చంగా సరిపడే నటీనటుల్ని ఎంపిక చేయడంలో రాజీపడని దర్శకుడు శ్యామ్ బెనెగల్. నసీరుద్దీన్ షా, సాధు మెహర్, ఓంపురి, అమ్రిష్ పురి, అనంత్‌నాగ్, గిరీశ్ కర్నాడ్, షబానా అజ్మీ, స్మితాపాటిల్, ప్రియా తెందూల్కర్, వాణిశ్రీ (అనుగ్రహం), పల్లవిజోషి, సులభాదేశ్ పాండే తదితర నటులు శ్యామ్ బెనెగల్ ఊహల్లోని పాత్రల్లో ఒదిగిపోయారు.
హత్తుకునే కథలతో
సమాంతర సినిమా, కొత్తతరం సినిమా అనే మాటల్ని శ్యామ్ బెనెగల్ అస్సలు ఇష్టపడేవారు కాదు. ఆయన దృష్టిలో సినిమా అనేది ఒక్కటే! అయితే వాస్తవానికి సమాంతర చిత్రాలతోనే ఆయన పేరు మార్మోగిపోయినా, అందరినీ ఆశ్చర్యపరిచేలా 2001లో జుబేదా అనే పక్కా వాణిజ్య చిత్రాన్ని తెరకెక్కించారు.
అంకుర్ మొదలుకొని వెల్డన్ అబ్బా వరకూ ఆయన తీసిన చిత్రాలైనా, టీవీ ధారావాహికలైనా కథల్ని మనసులకు హత్తుకునేలా చెప్పారు.
ఆయన తెరకెక్కించిన మండి పాకిస్థాన్ కథైనప్పటికీ, దాన్ని భువనగిరి నేపథ్యంలో తెరకెక్కించారు. అదే ఏడాది నిశాంత్ చిత్రంతో తెలంగాణ పోరాటాన్ని, భూస్వాముల దురాగతాల్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. శ్వేత విప్లవ పితామహుడిగా పేరు పొందిన వర్ఘీస్ కురియన్ జీవిత కథ ఆధారంగానే మంథన్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా నిర్మాణం కోసం 5 లక్షల మంది రైతులు ఒకొక్కరు రూ.2 పెట్టుబడి పెట్టారు. మన దేశంలో ప్రజా విరాళాలతో నిర్మితమైన తొలి చిత్రంగా, ప్రపంచంలో ఎక్కువమంది నిర్మించిన తొలి క్రౌడ్ ఫండింగ్ సినిమాగా ఈ చిత్రం రికార్డుల్లోకి ఎక్కింది.
మరాఠీ నటి హంస వాట్కర్ జీవిత చరిత్ర ఆధారంగా 1977లో భూమిక, ఇదే ఏడాది హిందీ, తెలుగు భాషల్లో అనుగ్రహం చిత్రాల్ని తెరకెక్కించారు. కలవారి పంచన పేదలకు మిగిలేది నయవంచన అనే విషయాన్ని జునూన్ (1979)తో ఎలుగెత్తి చాటారు. ఇది బెనెగళ్కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వేశ్యల జీవితాల నేపథ్యంలో రూపొందించిన మండి ప్రేక్షకుల హృదయాల్ని కదిలించింది. ఇందులో షబానా అజ్మీ, స్మితా పాటిల్ పోటాపోటీగా నటించారు. త్రికాల్', 'సుహాస్', 'సర్దారీ బేగం' ఇలా ఆయన చేసిన ప్రతి సినిమా ఓ ప్రత్యేకమే. ఆయన సినిమాల్లో హంగులు ఆర్భాటాలు, భారీ తారాగణాలు, భారీ సెట్లు కనిపించవు. బలమైన కథలు మాత్రమే కనిపిస్తాయి. ఆయన సినిమాల్లోని మహిళా పాత్రలు శక్తిమంతంగా ఉంటాయి.
బంగ్లాదేశ్ జాతిపిత, తొలి అధ్యక్షుడు షేక్ ముజీబుర్ రెహమాన్ జీవితం ఆధారంగా తన చివరి చిత్రాన్ని తెరకెక్కించారు శ్యామ్ బెనెగల్. 2023లో విడుదలైన ఈ చిత్రానికీ పలు అంతర్జాతీయ పురస్కారాలు దక్కాయి. ఇటీవలే తన 90వ పుట్టినరోజును చేసుకున్న శ్యామ్ బెనెగల్ రెండు ప్రాజెక్టుల కోసం కథలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. అంతలోనే ఆయన కన్నుమూయడం చిత్రసీమలో విషాదాన్ని నింపింది.
ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం - ప్రముఖ దర్శకుడు కన్నుమూత