Ram Charan Fathers day Special :సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ తన ఫ్యామిలీతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తూ సందడి చేస్తుంటారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. సమయం దొరికినప్పుడల్లా ఇంట్లో అందరితో సరదాగా ఉంటూనే అప్పుడప్పుడు వెకేషన్స్‌కు వెళ్తుంటారు. ఇప్పుడేమో తన గారాలపట్టి క్లీంకారతో ఫుల్‌టైమ్ గడిపేస్తున్నారు. ఆమెకు గోరుముద్దలు తినిపిస్తూ తండ్రిగా మధుర క్షణాలను ఆస్వాదిస్తున్నారు. తాజాగా తన కుమార్తెతో స్పెండ్ చేసే మూమెంట్స్ గురించి చెర్రీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఫాదర్స్ డే సందర్భంగా ఈ విశేషాలను పంచుకున్నారు.
"క్లీంకారకు రోజుకు రెండు సార్లైనా నేను తినిపిస్తుంటాను. అలా చేయడం నాకు ఎంతోఇష్టం. నేను గోరుముద్దలు పెడితే గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే. ఆ విషయంలో నన్నెవరూ బీట్ చేయలేరు" అంటూ చెర్రీ ఎంతో గర్వంగా చెప్పుకుంటూ మురిసిపోయారు. ఆమెకు అన్నం పెట్టేటప్పుడు తనలోకి సూపర్‌పవర్స్ ఆవహిస్తాయని వెల్లడించారు.
తన గారాల పట్టి ఇప్పుడిప్పుడే కుటుంబ సభ్యులను గుర్తిస్తోందంటూ ఇదే ఇంటర్వ్యూలో తెలిపారు. షూటింగ్స్‌కు వెళ్లినప్పుడు తనను ఎంతగానో మిస్ అవుతున్నట్టు ఫీల్ అయ్యారు. తన బిడ్డ స్కూల్‌లో జాయిన్ అయ్యే వరకైనా ఆమెతో ఎక్కువగా సమయం గడిపేందుకు తదుపరి మూవీస్‌ను ప్లాన్ చేసుకోనున్నట్లు తెలిపారు. క్లీంకారతో ఉంటే తన తండ్రి చిరంజీవి కూడా పిల్లాడిగా మారిపోతారని అన్నారు. "నన్ను తాత అని పిలవకు బోరింగ్‌గా ఉంటుంది. చిరుత అని పిలువు" అంటూ నవ్వుతుంటారని చెప్పారు.