Rajinikanth Furious On Reporter : కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా ఓ రిపోర్టర్‌పై అసహనం వ్యక్తం చేశారు. అసంబద్ధమైన ప్రశ్నలు అడగవద్దంటూ కోరారు. తనను రాజకీయంగా ఎటువంటి ప్రశ్నలకు అడగొద్దని అన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
ఆ ప్రశ్న వల్ల అసహనం
రజనీ ప్రస్తుతం 'కూలీ' సినిమా షెడ్యూల్‌తో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన తాజాగా అప్‌కమింగ్ షూటింగ్ కోసం థాయిలాండ్ వెళ్లారు. ఆ సమయంలో ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో ముచ్చటించారు. వారు ఆయన్ను సినిమా అప్డేట్స్తో పాటు పలు ప్రశ్నలు అడిగారు.
ఇటీవల చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన అక్కడ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో 'సమాజంలో మహిళల భద్రత' గురించి ఓ విలేకరి ప్రశ్నించగా, దానికి ఆయన అసంబద్ధమైన ప్రశ్నలు వేయొద్దని కోరారు. రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు తనను అడగవద్దని స్పందించారు.
ఇదిలా ఉండగా, ఇదే వేదికగా 'కూలీ' మూవీ అప్‌డేట్‌ను కూడా పంచుకున్నారు రజనీ. షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తయిందని తెలిపారు. అయితే జనవరి 13 నుంచి 28 వరకు మరో షెడ్యూల్ జరగనుందని పేర్కొన్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను పంచుకుంటామని అన్నారు.