How to Avoid Junk Food Cravings: మనలో చాలా మందికి నూడుల్స్, చిప్స్ లాంటి జంక్ ఫుడ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఇంకా కొంతమంది కడుపు నిండా ఆహారం తీసుకున్నా సరే.. జంక్ ఫుడ్స్ పైకి మనసు లాగుతుంటుంది. కానీ, ఈ అలవాటు దీర్ఘకాలంలో వివిధ రకాల అనారోగ్యాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇలాంటి వాటిని తినడం మానేయాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆహారపు కోరికల్ని అదుపులో పెట్టుకోవాలంటే కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం
ఊబకాయం తప్పదు!: సాధారణంగానే గర్భం ధరించిన మహిళలకు ఈ తరహా ఆహారపు కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా మూడ్ స్వింగ్స్, పని ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, పోషకాహార లోపం కూడా దీనికి కారణం అవుతుంటాయని నిపుణులు అంటున్నారు. ఇలాంటి సమయాల్లో జంక్‌ఫుడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొవ్వులు, కేలరీలు పెరిగిపోతాయని చెబుతున్నారు. ఇవి దీర్ఘకాలంలో ఊబకాయానికి దారితీస్తాయని వివరిస్తున్నారు. పైగా గర్భిణులు ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం తల్లీబిడ్డలిద్దరికీ మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ ఆహారపు కోరికల్ని అదుపులో ఉంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.
నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి: నీళ్లు తగిన మోతాదులో తీసుకోవడం వల్ల ఆహార కోరికలు నియంత్రణలో ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా శరీరం తేమను కోల్పోకుండా కూడా జాగ్రత్తపడచ్చని అంటున్నారు.
ఎక్కువ గ్యాప్ ఇవ్వద్దు!: ఇంకా బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌ల మధ్య ఎక్కువ గ్యాప్ ఇవ్వద్దని నిపుణులు చెబుతున్నారు. తక్కువ మోతాదులో ఎక్కువసార్లు ఆహారం తినడం వల్ల చిరుతిండ్లపైకి మనసు మళ్లకుండా జాగ్రత్తపడచ్చని సలహా ఇస్తున్నారు. అలాగే మధ్యమధ్యలో బాదం, వాల్‌నట్స్, జీడిపప్పులు, పండ్లు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు. 2019లో Nutrients జర్నల్‌లో ప్రచురితమైన "Eating frequency and weight management" అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది.
భోజనం మానద్దు!: మనలో చాలామంది వివిధ పనుల్లో పడి భోజనం చేయడం మర్చిపోతుంటారు. దీంతో ఆకలేసినప్పుడు అందుబాటులో ఉన్న పదార్థాలను తినేసి ఆకలిని తీర్చుకుంటారు. అయితే ఇది ఏ మాత్రం మంచి అలవాటు కాదని నిపుణులు అంటున్నారు. కాబట్టి సరైన సమయంలోనే ఆహారం తీసుకోవడం వల్ల జంక్‌ఫుడ్స్‌కి దూరంగా ఉండచ్చని సలహా ఇస్తున్నారు.
ప్రొటీన్లు: కార్బోహైడ్రేట్లతో పోల్చితే ప్రొటీన్లు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రొటీన్లు పుష్కలంగా లభించే పాలు, పాల పదార్థాలు, కోడిగుడ్లు, నట్స్ వంటివి తీసుకుంటే ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుందని అంటున్నారు. ఫలితంగా ఇతర ఆహార పదార్థాల పైకి మనసు మళ్లదని వివరిస్తున్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
బాగా నమిలి మింగండి!: ముఖ్యంగా ఆహారాన్ని బాగా నమిలి తినడం వల్ల ఆహార కోరికలు తగ్గిపోతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఇంకా వీటితో పాటు కంటి నిండా నిద్ర, ఒత్తిడిని దూరం చేసుకోవడానికి యోగా, ధ్యానం, ఇతర వ్యాయామాలు చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కూడా ఆహారపు కోరికల్ని అదుపు చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీ బ్రెయిన్ షార్ప్‌గా పనిచేయాలా? ఈ ఒక్క పని చేస్తే చాలట!
మెసేజ్ రాగానే రిప్లై ఇస్తున్నారా? ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? స్క్రీన్ ఆప్నియా కారణాలేంటి?