How to Make Sindoor at Home in Telugu: హిందూ సంప్రదాయంలో పసుపు, కుంకుమకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పూజల సమయంలో వీటిని విరివిగా ఉపయోగిస్తారు. అంతేకాదు మహిళల ఐదోతనానికి గుర్తుగా వీటిని సూచిస్తారు. అందుకే పెళ్లైన మహిళలు కుంకుమ వాడుతుంటారు. కొందరు దీన్ని నుదుటన పెట్టుకుంటే, మరికొంతమంది పాపిట్లో దిద్దుకుంటారు. పెళ్లికాని వారు సైతం కుంకుమను డైలీ ధరిస్తారు. అయితే ప్రస్తుత రోజుల్లో కుంకుమ కూడా కల్తీ అవుతుంది. ఇలా కల్తీ జరిగిన కుంకుమను వాడటం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయని, దీంతో ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఇంట్లో తయారు చేసిన కుంకుమ ఉపయోగించడం మంచిదంటున్నారు నిపుణులు. మరి ఇంట్లోనే దీనిని ఎలా తయారు చేసుకోవాలి? కల్తీ కుంకుమ వాడటం వల్ల వచ్చే సమస్యలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ఎలాంటి సమస్యలొస్తాయ్?: సహజంగా తయారుచేసిన కుంకుమ ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. లేదంటే కాస్త ఆరెంజ్ కలర్లో లభిస్తుంది. అయితే కొంతమంది దళారులు ఇందులో ఆర్టిఫిషియల్ కలర్స్ కలుపుతున్నారని, మెరిసేలా చేయడానికి లెడ్-మెర్క్యురీ వంటి రసాయనాలు వాడుతున్నారని చెబుతున్నారు. ఇలాంటి కల్తీ కుంకుమ వాడడం వల్ల చాలామందిలో చర్మ సంబంధిత అలర్జీలు, దద్దుర్లు, దురద, సింధూరం పెట్టిన ప్రదేశంలో చర్మం ఎరుపెక్కడం.. వంటి పలు రకాల లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు. అంతేకాకుండా కల్తీ కుంకుమను దీర్ఘకాలం పాటు వాడితే బ్రీతింగ్కు సంబంధించిన పలు సమస్యలకు దారితీయడంతో పాటు నాడీ, మూత్రపిండాలు, ప్రత్యుత్పత్తి వ్యవస్థల పైనా ప్రతికూల ప్రభావం చూపుతాయని అంటున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కు సంబంధించిన నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో కూడా లెడ్ కలిపిన కుంకుమ వాడటం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయని ప్రచురించారు.(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
ఇంట్లోనే తయారీ ఇలా:
కావాల్సిన పదార్థాలు:
- సేంద్రియ పసుపు - 2 టేబుల్ స్పూన్లు
- నెయ్యి - 1 టేబుల్ స్పూన్
- రోజ్ వాటర్ - 1 టేబుల్ స్పూన్
- నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
- సున్నం - చిటికెడు
తయారీ విధానం:
- మిక్సీజార్ తీసుకుని అందులోకి పసుపు, నెయ్యి, రోజ్ వాటర్, నిమ్మరసం, సున్నం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఈ మిశ్రమం మొత్తం ఎరుపు రంగులోకి మారిన తర్వాత ఓ ప్లేట్లోకి తీసుకుని నీడలో ఆరనివ్వాలి.
- పొడిపొడిగా మారిన తర్వాత కుంకుమ భరణిలోకి తీసుకుని వాడుకుంటే నేచురల్ కుంకుమ రెడీ.
- ఇది మంచి సువాసనతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు.
బరువు తగ్గడం నుంచి క్యాన్సర్ వరకు - కుంకుమపువ్వు ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు!
హనుమంతుడు సింధూరం రంగులోనే ఉంటాడెందుకు? - ఈ ఆసక్తికర విషయం మీకు తెలుసా?