Pushpa 2 Ticket Price :యావత్ సినీ ప్రపంచం ఆత్రుతగా ఎదురుచూస్తున్న 'పుష్ప 2' సినిమా మరో నాలుగు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్ ముందురోజు (డిసెంబర్ 4) రాత్రి 9.30 గంటలకే బెనిఫిట్ షో పడనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లను కూడా పెంచుకునేందుకు వీలు కల్పించింది. పెరిగిన రేట్లతో బెనిఫిట్ షో టికెట్ ధర సింగిల్ స్క్రీన్స్‌లో సుమారు రూ. 1000, మల్టీప్లెక్స్‌లలో రూ.1200 పైగా అవుతోంది. అయితే ఓ థియేటర్లో మాత్రం ఒక్క టికెట్ ధర అక్షరాల రూ.3 వేలుగా ఉంది. మరి ఆ థియేటర్ ఎక్కడుంది? టికెట్ ధర అంత ఖరీదు ఉండటానికి కారణం ఏంటో తెలుసా?
ముంబయిలోని జియో వరల్డ్‌డ్రైవ్‌లో ఉన్న పీవీఆర్ మైసన్ (PVR Maison) లో పుష్ప సినిమాకు ఒక్క టికెట్ ధర ఏకంగా రూ.3వేలు చూపిస్తోంది. అయితే రేట్‌కు తగ్గట్లే ఆడియెన్స్‌కు వీఐపీ రేంజ్లో సౌకర్యాలు ఉండడమే ఆ రేట్‌కు కారణం. పీవీఆర్ మైసన్‌లోని ఓ స్క్రీన్‌లో కేవలం 34 సీట్లే ఉంటాయి. ఉదయం నుంచి ప్రదర్శించే షోలకు రూ.900 ఉండగా, రాత్రి 7.35 నిమిషాల షోకు మాత్రం టికెట్ ధర రూ.3వేలు ఉండటం గమనార్హం. అదే మాల్లో ఉన్న మిగిలిన స్క్రీన్‌లలో రెక్లయినర్ ధర రూ.2100గా ఉంది. దీనికి సంబంధించిన బుకింగ్ స్క్రీన్‌షాట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
లగ్జరీ సౌకర్యాలు
జియో వరల్డ్ డ్రైవ్‌లోని పీవీఆర్ సినిమాస్‌లో పూర్తిగా లగ్జరీ వాతావరణం ఉంటుంది. ప్రతి ప్రేక్షకుడు సౌకర్యవంతంగా కూర్చోవడానికి వీలుగా స్క్రీన్‌ను బట్టి ఓపస్ గ్లైడ్ రెక్లయినింగ్ సీట్లు అమర్చారు. అయితే రూ.3వేలు టికెట్ ధర ఉన్న స్క్రీన్‌లో మాత్రం వెరోనా జీరో వాల్ సీట్లు ఉంటాయి. ఇవి అత్యంత లగ్జరీగా ఉంటాయి.