Daku Maharaj Prequel :నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ మూవీ 'డాకు మహారాజ్'. సంక్రాంతి కానుకగా ఆదివారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ దక్కించుకుంది. విడుదలకు ముందు ఏ స్థాయిలో జోరు కనిపించిందో ఇప్పుడు అంతకు రెట్టింపు స్థాయిలో బాక్సాఫీస్ వద్ద డాకు జోరు నడుస్తోంది. ఈ క్రమంలోనే నిర్మాత నాగవంశీ నందమూరి అభిమానులకు ఓ సర్ప్రైజ్ న్యూస్ చెప్పారు.
డాకుకు ప్రీక్వెల్
సినిమా మంచి టాక్ దక్కించుకోవడం వల్ల మూవీటీమ్ ఆదివారం ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న నిర్మాత నాగవంశీకి 'డాకు మహారాజ్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా?' అనే ప్రశ్న ఎదురైంది. దీనికి నాగవంశీ జవాబిచ్చారు. 'సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నాం. సినిమాలో గుర్రంపై చూపిన ఓ సీన్‌ను బేస్ పాయింట్ చేసుకొని ప్రీక్వెల్ తీసేందుకు ప్రయత్నిస్తాం' అని అన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య ఖాతాలో మరో హిట్ ఖాయమని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
అంతటా పాజిటివ్ టాక్
సంక్రాంతి కానుకగా విడుదలైన 'డాకు మహారాజ్' సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్, స్టోరీ ఇలా అన్ని ఎలిమెంట్స్ బాగున్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇది బాలయ్య మాస్ జాతర అని, ఆయన యాక్షన్ అదిరిందని అంటున్నారు. ఇక తమన్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచిందని, బాలయ్య లుక్ అదిరిపోయిందని మరికొందరు చెబుతున్నారు.