Prasanth Varma Rajamouli : 'హనుమాన్' చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ చిత్రంతో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న ఆయన ప్రస్తుతం విజయోత్సాహంతో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా దర్శకధీరుడు రాజమౌళిపై తనకున్న అభిప్రాయాన్ని తెలిపారు.
ఆయన అంటే తనకెంతో ఇష్టమని ప్రశాంత్ వర్మ అన్నారు. రాజమౌళి టీమ్‌లోకి ప్రవేశించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినట్లు గుర్తు చేసుకున్నారు. "ఆయన మేకింగ్ స్టైల్ అంటే నాకెంతో ఇష్టం. ఆయన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయాన్ని ఎన్నోసార్లు ట్రై చేశాను. ఇంజినీరింగ్ చదువుతున్న రోజుల్లోనే అవకాశాల కోసం మెయిల్స్ పంపించాను. నా అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించారు. తమ టీమ్‌లో ఖాళీ లేదని చెప్పారు. హార్డ్‌వర్క్, టాలెంట్ ఉన్నా నన్నెందుకు తీసుకోవడం లేదనే కారణంతో ఆయనపై కోపం కూడా వచ్చింది. అదే సమయంలో ఏకలవ్యుడు గుర్తుకువచ్చారు. జక్కన్న సినిమాలు, మేకింగ్ వీడియోలు చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను" అని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు.
"పెద్ద హీరోలతో పని చేయడానికి నేను వ్యతిరేకం కాదు. కానీ వాళ్లతో సినిమా చేయడం అంటే ఎక్కువ సమయం పట్టొచ్చు. వాళ్ల కోసం ఎదురుచూసి నా టైమ్ వృథా చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత డెడ్‌లైన్ పెట్టుకుని వర్క్ చేస్తున్నాను. ఒకవేళ టామ్ క్రూజ్ వచ్చినా కూడా నా వద్ద ఉన్న వాళ్లతోనే సినిమా చేస్తాను" అని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు.