Sivarapalli Telugu Trailer :సినిమాల్లాగే సిరీస్‌లూ ఈ మధ్యకాలంలో ప్రజాదరణ పొందుతున్నాయి. భాషతో సంబంధం లేకుండా ఎన్నో సిరీస్‌లు సక్సెస్ సాధించాయి కూడా. ముఖ్యంగా హిందీలో పలు సిరీస్‌లకు ఓటీటీల్లో టాప్ రేటింగ్ కూడా వచ్చి దూసుకెళ్లాయి. అలా హిందీలో సక్సెస్ అయిన ఓ వెబ్‌సిరీస్‌ను తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బీటౌన్ ఆడియెన్స్‌తో పాటు యావత్ దేశంలో పాపులర్ అయిన ఆ సిరీస్ ఏదంటే ?
తమిళంలో అలా తెలుగులో ఇలా!
యంగ్ హీరో రాగ్ మయూర్ కీలక పాత్రలో 'సివరపల్లి' అనే పేరుతో ఈ సిరీస్ రిలీజ్ కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ వేదికగా పాపులర్ అయిన 'పంచాయత్' సిరీస్‌కు ఇది రీమేక్‌గా రానుంది. జనవరి 24వ తేదీ నుంచి ప్రైమ్‌లోనే ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు తాజాగా మేకర్స్ వెల్లడించారు. ఈ క్రమంలో తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ టీజర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం అది నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే దీన్ని తమిళంలో 'తలైవెట్టియాన్ పాలయం' అనే పేరుతో రీమేక్ చేయగా, అక్కడ కూడా మంచి టాక్ అందుకుంది. ఇప్పుడు ఇదే సిరీస్ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.
ఇందులో రాగ్ మయూర్ శ్యామ్ అనే పాత్రలో కనిపించనున్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన శ్యామ్ తన కెరీర్‌ను బిల్డ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. అప్పుడే తన స్నేహితుడి సలహా మేరకు తెలంగాణలో మారుమూల గ్రామమైన సివరపల్లిలో ఉద్యోగం చేసేందుకు వెళ్తాడు. అయితే నిజాయతీగా పని చేయాలనుకున్న శ్యామ్‌కు ఆ గ్రామమంలో ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిన్నంటినీ అతడు ఎలా అధిగమించాడు? సిటీ నుంచి గ్రామానికి వెళ్లిన ఆ వ్యక్తి అక్కడ ఎలాంటి లైఫ్‌స్టైల్‌ను జీవించాడు. అన్న ఆసక్తికర అంశాలతో ఈ సిరీస్ సాగనుంది.