Kantara 2 Shooting Issue : కన్నడ సినిమా 'కాంతార' అన్ని భాషల్లో సూపర్ హిట్ అయింది. ఈ మూవీ దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి ఇప్పుడు 'కాంతార 2' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కి అడ్డంకులు ఎదురవుతున్నాయి. మూవీ టీమ్ నిబంధనలను ఉల్లంఘించి, వన్యప్రాణులకు లేదా పర్యావరణానికి హాని కలిగించారని దర్యాప్తులో తేలితే, హాసన్ జిల్లాలో షూటింగ్ చేయకుండా నిషేధిస్తామని కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే సోమవారం ప్రకటించారు.
మంత్రి స్పందన
విధానసౌధలో మంత్రి ఖండ్రే విలేకరులతో మాట్లాడారు. "గవిబెట్ట సమీపంలో 23 రోజుల పాటు షూట్ చేయడానికి హోంబలె ఫిల్మ్స్ షరతులతో కూడిన అనుమతి పొందింది. అయితే సిబ్బంది పేలుడు పదార్థాలను ఉపయోగిస్తున్నారని, ఆ ప్రాంతంలో వన్యప్రాణులను కలవరపెడుతున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. షూటింగ్ ప్రాంతాన్ని వెంటనే పరిశీలించాలని అధికారులను ఆదేశించాను. సినిమా బృందం షరతులను ఉల్లంఘిస్తే లేదా వన్యప్రాణులు లేదా వృక్షజాలం, జంతుజాలానికి ఏదైనా హాని కలిగించిందని తేలితే, షూటింగ్ ఆపేస్తాం. కఠినమైన చర్యలు తీసుకుంటాం' అని చెప్పారు.
అటవీ, పర్యావరణ, జీవశాస్త్ర శాఖ అదనపు ముఖ్య కార్యదర్శిని వీలైనంత త్వరగా షూటింగ్ జరిగిన ప్రాంతాన్ని సందర్శించాలని మంత్రి ఆదేశించారు. అడవులు, వన్యప్రాణులను రక్షించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాల్సిన అవసరాన్ని ఖండ్రే చెప్పారు. మరింత నష్టం జరగకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు.
'పర్యావరణానికి హాని కలిగించారు'
హాసన్ జిల్లా గవిబెట్ట, హేరూర్ గ్రామ వాసులు రిషబ్ శెట్టి, అతడి బృందంపై ఆందోళనకు దిగారు. షూటింగ్ సమయంలో పేలుడు పదార్థాలు వాడడం, రక్షిత అటవీ ప్రాంతాల్లోకి ప్రవేశించడం ద్వారా పర్యావరణానికి హాని కలిగించారని ఆరోపించారు. సినిమా షూటింగ్‌కి గ్రామ గ్రాసం భూముల వరకే అనుమతి ఉందని చెబుతున్నారు.
జిల్లా పంచాయతీ మాజీ సభ్యుడిగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి పరిస్థితిపై హెచ్చరిస్తూ ఓ వీడియోని పోస్ట్ చేశాడు. ఇప్పటికే ఈ ప్రాంతంలోని రైతులు అడవి ఏనుగుల దాడులతో ఇబ్బందులు పడుతున్నారని, అడవులు మరింతగా దెబ్బతింటే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.