Union Budget 2025 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో విద్య, వైద్య, వైమానిక, పర్యటక రంగాలకు భారీ ఎత్తున కేటాయింపులు చేశారు.
ఆరోగ్య రంగానికి రూ.93వేల కోట్లు కేటాయింపు
2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య రంగానికి రూ.98,311 కోట్లను కేటాయించినట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రానున్న మూడేళ్లలో దేశంలోని అన్ని జిల్లా ఆస్పత్రుల్లో 'డేకేర్ క్యాన్సర్' సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు ఆమె ప్రకటించారు. అందులో 200 డేకేర్ క్యాన్సర్ సెంటర్లను 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. క్యాన్సర్, అరుదైన వ్యాధులు,ఇతర తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఉపశమనం కలిగించేందుకు ప్రాణాలు కాపాడే 36 ఔషధాలను ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుంచి పూర్తిగా మినహాయించారు.
ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (పీఎంజేఏవై) కింద గిగ్ వర్కర్లకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు కల్పిస్తామని సీతారామన్ చెప్పారు. ఇది కోటి మంది గిగ్ కార్మికులకు దోహదపడుతుందని తెలిపారు. రానున్న ఐదేళ్లలో వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లో 75వేల వైద్య సీట్లను పెంచుతామన్నారు. అందులో భాగంగా వచ్చే ఏడాదిలో వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లో 10 వేల అదనపు సీట్లను కల్పిస్తామని ఆమె చెప్పారు.
"రానున్న మూడేళ్లలో దేశంలోని అన్ని జిల్లా ఆసుపత్రుల్లో డేకేర్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం. 200 కేంద్రాలను 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే ఏర్పాటు చేస్తాం. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ గిగ్ వర్కర్లు న్యూ ఎయిడ్ సర్వీసెస్ ఎకానమీలో గొప్ప సహకారం అందిస్తున్నారు. గిగ్ వర్కర్ల సహకారాన్ని గుర్తిస్తూ వారికి గుర్తింపు కార్డులు ఇవ్వడానికి, రిజిస్టర్ చేసుకోవడానికి ఈ-ఫారమ్ పోర్టల్‌లో కేంద్రం ఏర్పాట్లు చేస్తుంది. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద గిగ్ వర్కర్లకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు కల్పిస్తాం. ఇది కోటి మంది గిగ్ వర్కర్లకు దోహదపడుతుంది."
- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థికమంత్రి
విద్యారంగానికి రూ.1.28 లక్షలు
2025-26 ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌లో విద్యరంగానికి రూ.1,28,650 కోట్లు కేటాయించినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దేశంలోని 23 ఐఐటీల్లో పదేళ్లలో సీట్ల సంఖ్యను వంద శాతం పెంచుతామన్నారు. 2014 తర్వాత ఏర్పాటైన ఐదు ఐఐటీల్లో 6,500 మంది విద్యార్థులకు విద్య అందించేలా అదనపు మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. పట్నాలోని ఐఐటీలో హాస్టల్, ఇతర మౌలిక సదుపాయాలను విస్తరించనున్నట్లు చెప్పారు. ఐదేళ్లలో ఐఐటీ, ఐఐఎస్సీలలో సాంకేతిక పరిశోధన కోసం 10వేల ఫెలోషిప్‌లను అందించనున్నట్లు ప్రకటించారు. ఐదు జాతీయ నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.
శాస్త్రీయ దృక్పథాన్ని పెంచేందుకు పాఠశాలల్లో 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్, గ్రామీణ ప్రాంతాల్లోని స్కూల్స్, పీహెచ్‌సీలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అందిస్తామన్నారు. విద్య కోసం ఏఐ ఎక్సలెన్స్ సెంటర్‌ను 500 కోట్లతో ఏర్పాటు చేస్తామన్నారు. పాఠ్యపుస్తకాలను డిజిటల్‌గా అందించేందుకు 'భారతీయ భాషా పుస్తక్' పథకాన్ని ప్రారంభిస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు.
"2023లో వ్యవసాయం, ఆరోగ్యం, సుస్థిర నగరాలు అనే మూడు ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను నేను ప్రకటించాను. ఇప్పుడు రూ.500 కోట్ల వ్యయంతో విద్యాభివృద్ధి కోసం ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయనున్నాం."
- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థికమంత్రి
పర్యటక రంగానికి చేయూత
దేశంలోని 50 పర్యటక స్థలాలను రాష్ట్రాల భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశంలో పర్యటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు హోం స్టేలకు ముద్రా రుణాలను ఇస్తామని చెప్పారు. ప్రైవేటు రంగంతో కలిసి వైద్య పర్యటకాన్ని ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. గౌతమ బుద్ధుడికి సంబంధించిన ప్రాంతాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. పశ్చిమ కోసి కెనాల్ నిర్మాణానికి ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు ప్రకటించిన నిర్మల సీతారామన్, దీని వల్ల బిహార్ మిథిలాంచల్ ప్రాంతంలోని 50వేల హెక్టార్లకు లబ్ధి చేకూరుతుందని వివరించారు.
"ఉపాధిని కల్పించే పర్యటకాభివృద్ధి కోసం దేశంలోని 50 ప్రసిద్ధ పర్యటక ప్రదేశాలను ఛాలెంజ్ మోడ్‌లో రాష్ట్రాల భాగస్వామ్యంతో కలిసి అభివృద్ధి చేస్తాం. కీలకమైన మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం రాష్ట్రాలు భూమిని కేటాయించాల్సి ఉంటుంది. ఆయా పర్యటక ప్రదేశాలలో హోటళ్లను కూడా మౌలిక సదుపాయాల జాబితాలో చేర్చనున్నాం. యువత కోసం ఆతిథ్యం సహా ఇతర నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తాం. హోం స్టేస్ కోసం ముద్రా రుణాలను అందజేస్తాం. పర్యటక స్థలాలకు అనుసంధానతను మరింత మెరుగుపర్చనున్నాం."
- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
ఉడాన్- సామాన్యులకు అందుబాటులో విమాన ప్రయాణం
బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సవరించిన (మోడిఫైడ్) ఉడాన్ పథకాన్ని ప్రకటించారు. దీని ద్వారా 120 రూట్లలో కొత్తగా విమానాలు నడపనున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు సుమారు 1.5 కోట్ల మంది లబ్ధి పొందినట్లు వెల్లడించారు. 88 పోర్టులు, ఎయిర్‌పోర్టులను కనెక్ట్ చేసినట్లు పేర్కొన్నారు. మరో 698 రూట్లను ఆపరేషనలైజ్ చేసినట్లు తెలిపారు. ఈ ఉడాన్ పథకం ద్వారా రానున్న 10 సంవత్సరాల్లో 4 కోట్ల మంది ప్రయాణికులకు విమాన సర్వీస్‌లు అందుబాటులోకి వస్తాయని ఆమె తెలిపారు.
'భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేంగా అభివృద్ధి చెందుతున్న పౌర విమానాయన మార్కెట్లలో ఒకటి. అందుకే ఉడాన్ పథకం ద్వారా కొండ ప్రాంతాలు, ఈశాన్య భారత ప్రాంతాల్లో కూడా హెలిప్యాడ్లు, చిన్న విమానాశ్రయాలు నిర్మిస్తాం' అని ఆమె తెలిపారు. బిహార్‌లో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి వెల్లడించారు. పట్నా విమానాశ్రయం, బిహ్తాలోని బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయాల సామర్థ్యాన్ని కూడా పెంచుతామని అన్నారు. ఈ ఏడాది బిహార్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి ఆర్థిక మంత్రి పలు ఆర్థిక ప్రోత్సాహాలు ప్రకటించారు.
'రూ.12లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ నిల్- పన్ను రేట్లలో మార్పులు'
చెప్పులు, సూపర్ బైక్‌లు ఇక చీప్! ధరలు తగ్గే, పెరిగే వస్తువులివే!