తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

శ్రీవిష్ణు హారర్​ కామెడీ - 'ఓం భీమ్‌ బుష్‌' ఎలా ఉందంటే? - Om Bheem Bush Review In Telugu - OM BHEEM BUSH REVIEW IN TELUGU

Om Bheem Bush Review : యంగ్ స్టార్స్ శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన 'ఓం భీమ్‌ బుష్‌' సినిమా ఎలా ఉందంటే?

Om Bheem Bush Review
Om Bheem Bush Review

By ETV Bharat Telugu Team

Published : Mar 22, 2024, 8:40 AM IST

Updated : Mar 22, 2024, 12:40 PM IST

Om Bheem Bush Review : చిత్రం: ఓం భీమ్‌ బుష్‌; న‌టీనటులు: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి తదితరులు; ఛాయాగ్ర‌హ‌ణం: రాజ్ తోట సంగీతం: సన్నీ MR; క‌ళ‌: శ్రీకాంత్ రామిశెట్టి; కూర్పు: విజయ్ వర్ధన్; నిర్మాతలు: వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు; రచన, దర్శకత్వం: శ్రీ హర్ష కొనుగంటి; స‌మ‌ర్ప‌ణ‌: యు.వి.క్రియేష‌న్స్‌; విడుద‌ల‌: 22-03-2024.

'సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌' సినిమాతో సూపర్​హిట్ సాధించిన ఈ స్టార్, ఇప్పుడు 'ఓం భీమ్ బుష్‌' అనే మరో ఎంటర్​టైనర్​తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇక ఆయనకు తోడుగా ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. భారీ అంచనాలతో ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే ?

క‌థేంటంటే :
లెగసీ యూనివ‌ర్సిటీలో పీహెచ్‌డీ స్టూడెంట్స్ అయిన బ్యాంగ్ బ్ర‌ద‌ర్స్ క్రిష్ (శ్రీ విష్ణు), విన‌య్ గుమ్మ‌డి (ప్రియ‌ద‌ర్శి), మ్యాడీ రేలంగి (రాహుల్ రామ‌కృష్ణ‌). వీళ్లు చేసే ప‌నులు భ‌రించ‌లేక త‌క్కువ స‌మ‌యంలోనే ఈ ముగ్గురికీ డాక్ట‌రేట్లు ఇచ్చి పంపించేస్తారు ఆ కాలేజీ ప్రొఫెస‌ర్‌. ఇక ఆ పట్టాతో ఈ ముగ్గురు భైర‌వ‌పురం చేరుకుంటారు. యూనివ‌ర్సిటీ లైఫ్​లాగే ఆ ఊళ్లోనూ జ‌ల్సాగా బ‌తకాల‌ని డిసైడై సైంటిస్టులుగా మారుతారు. ఎ టు జెడ్ స‌ర్వీసెస్ అంటూ ఓ దుకాణం తెరిచి ఎలాంటి స‌మ‌స్య‌ల‌కైనా ఇట్టే ప‌రిష్కారం చూపిస్తామ‌ంటూ ప్ర‌చారం చేసుకుంటారు.

కానీ ఈ ముగ్గురూ నిజ‌మైన సైంటిస్టులు కాద‌న్న విషయం బయటపడుతుంది. దాంతో ఆ ఊరి స‌ర్పంచ్ వాళ్లకు ఓ ప‌రీక్ష పెడతాడు. సంపంగి మ‌హ‌ల్‌లో ఉన్న నిధిని క‌నిపెట్టి తీసుకొస్తే వాళ్లను నిజ‌మైన సైంటిస్టుల‌ని న‌మ్ముతామ‌ంటూ చెబుతాడు. ఇక దెయ్యం ఉన్న ఆ మ‌హ‌ల్‌లోకి నిధి కోసం వెళ్లిన ఈ బ్యాంగ్ బ్ర‌ద‌ర్స్‌కి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? ఇంత‌కీ ఆ మహల్‌లో ఉన్న సంపంగి దెయ్యం స్టోరీ ఏంటి? అస‌లు వాళ్లు నిధిని తీసుకొచ్చారా ? లేదా? ఇలాంటివన్ని తెలియాలంటే ఇక తెర‌పై చూడాల్సిందే.

ఎలా ఉందంటే :
నో లాజిక్ ఓన్లీ మేజిక్ అంటూ క్యాప్షన్​లో చెప్పినట్లే లాజిక్‌తో సంబంధం లేకుండా కేవ‌లం మేజిక్‌నే న‌మ్ముకుంటూ తెర‌కెక్కించిన సినిమానే ఇది. 'జాతిర‌త్నాలు' లాగా ఇందులోనూ ముగ్గురు స్నేహితుల క్రేజీ ప్ర‌యాణానికి హార‌ర్ కామెడీని జోడించారు. దెయ్యాలు, ఆత్మ‌లు అంటేనే ఆ క‌థ‌ల్లో లాజిక్స్‌ను ఇక వెతక్కూడ‌దు. దెయ్యం భ‌య‌పెట్టిందా లేదా అనేది చూడాలంతే. అస‌లు ఇలా ఎలా సాధ్యం అని ప్ర‌శ్న వేసుకుంటే ఇక ఆ క‌థ అక్క‌డితో ఆగిపోయిన‌ట్టే. అందుకే లాజిక్స్ జోలికి వెళ్ల‌కుండా పాత్ర‌ల‌తో మాత్రం ప్ర‌యాణం చేస్తే మనకురం బ్యాంగ్ బ్ర‌ద‌ర్స్ అక్క‌డ‌క్క‌డా కొన్ని న‌వ్వుల్ని పంచుతారు.

సంపంగి దెయ్యం కూడా కొద్దిమేర భ‌య‌పెట్టి థ్రిల్ చేస్తుంది. ఇక స్నేహితులైన బ్యాంగ్ బ్ర‌ద‌ర్స్ కాలేజీలోకి చేరి ప్రొఫెస‌ర్‌ని మాట‌ల‌తో బురిడీ కొట్టించ‌డం నుంచి క‌థ మొద‌ల‌వుతుంది. అదే క‌థ భైర‌వ‌పురం చేరుకున్నాక‌, ఆ త‌ర్వాత ఊళ్లో వాళ్లు ఎ టు జెడ్ స‌ర్వీసెస్ మొద‌ల‌య్యాక అస‌లు సిస‌లు హంగామాకి తెర లేస్తుంది. ముగ్గురూ చేసే క్రేజీ ప‌నులు ఆడియెన్స్​ను న‌వ్విస్తాయి. ముఖ్యంగా సంతాన లేమితో బాధ‌ప‌డుతున్న ఓ వ్య‌క్తికి అంగ‌స్తంభ‌నల కోసం వైద్యం చేయ‌డం, స‌ర్పంచ్ ఇంట్లోకి ముగ్గురూ వెళ్లి చేసే అల్ల‌రి ఫస్టాఫ్​కు హైలైట్‌.

ఇక సెకెండాఫ్​ మొత్తం కూడా సంపంగి మ‌హ‌ల్‌లోనే సాగుతుంది. అక్క‌డ దెయ్యం రాహుల్ రామ‌కృష్ణ‌నీ, ప్రియ‌ద‌ర్శినీ భ‌య‌పెట్టే స‌న్నివేశాల్లో పండిన హార‌ర్, కామెడీ సినిమాపై మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది. సంపంగి దెయ్యం క‌థ‌తోపాటు, ప‌తాక స‌న్నివేశాల్లో ఎల్‌.జి.బి.టి అంశాన్ని స్పృశించిన తీరు కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. న‌వ్వించ‌డం కోసం అక్క‌డ‌క్క‌డా డబుల్ మీనింగ్స్​ను వాడుకున్నారు డైెరెక్టర్.

మరోవైపు శ్రీవిష్ణు, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి టైమింగ్ వ‌ల్ల వ‌న్ లైన‌ర్స్ బాగా పేలాయి. ఆరంభ సన్నివేశాలు, సెకెండాఫ్​లో దెయ్యంతో డేటింగ్ వంటి స‌న్నివేశాలు అంత‌గా ప్ర‌భావం చూపించ‌వు. ట్రెజ‌ర్ హంట్ నేప‌థ్యం ఉన్నప్పటికీ ఆ స‌ీన్స్ అన్నీ సాదాసీదాగా అనిపిస్తాయి. క‌థ ప‌రంగా ఆఖ‌రిలో మెప్పించిన ఈ సినిమా, కామెడీ ప‌రంగా కొన్ని కొన్ని ఎపిసోడ్లుగా ప్ర‌భావం చూపించింది.

ఎవ‌రెలా చేశారంటే :
శ్రీవిష్ణు, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి క‌లిసి పండించిన కామెడీ సినిమాకి ప్ర‌ధాన‌బ‌లంగా నిలిచింది. వీళ్ల మ‌ధ్య టైమింగ్ చాలా స‌న్నివేశాల‌కి బ‌లం తీసుకొచ్చింది. హీరోయిన్లు ప్రీతి ముకుంద‌న్‌, ఆయేషా ఖాన్‌లకు క‌థ‌లో ప్రాధాన్యం త‌క్కువగానే ఉంది. ర‌చ్చ ర‌వి, ఆదిత్య మేన‌న్‌, శ్రీకాంత్ అయ్యంగార్ తమ పాత్ర‌ల ప‌రిధి మేరకు న‌టించారు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. కెమెరా, సంగీతం, ఎడిటింగ్‌, ఆర్ట్ ఇలా త‌దిత‌ర విభాగాల‌న్నీ మంచి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. బంగ్లా, దెయ్యం, తీర‌ని కోరిక తదిత‌ర అంశాల‌న్నీ పాత‌దిగానే ఉన్నాయి. ఆ పాత క‌థ‌కి కొత్త‌గా హాస్యాన్ని మేళ‌వించడం వల్ల డైరెక్టర్ ఈ కథతో విజ‌య‌వంత‌మ‌య్యాడు. చివరిలో సందేశం కూడా కొత్త‌దే. నిర్మాణం ప‌రంగా లోటుపాట్లేవీ క‌నిపించ‌వు.

  • బ‌లాలు
  • + హాస్యం
  • + శ్రీవిష్ణు, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ న‌ట‌న
  • + ప‌తాక స‌న్నివేశాలు
  • బ‌ల‌హీన‌త‌లు
  • - తెలిసిన క‌థే
  • చివ‌రిగా: ఓం భీమ్ బుష్‌ - కొన్ని న‌వ్వుల‌తో మాయ చేస్తుంది.
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే

'ఇండస్ట్రీకి వచ్చాక ఆ విషయం అర్థమైంది'

'సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న' ఆగట్లేదుగా.. రెండో వారంలోనూ ఈ సినిమాదే హవా!

Last Updated : Mar 22, 2024, 12:40 PM IST

ABOUT THE AUTHOR

...view details